వరద నీటిలో చిక్కి..  రోజంతా చెట్టు పైనే..!

మధ్యప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహం పెరగడంతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చేపలకు .......

Published : 29 Aug 2020 17:56 IST


భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహం పెరగడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయి దాదాపు రోజంతా చెట్టుపైనే ఉండిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అతడిని కాపాడారు. హెలికాఫ్టర్‌ను రంగంలోకి దించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. చింద్వారా జిల్లాలోని బెల్కెడా గ్రామానికి చెందిన మధు కహర్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. భారీ వర్షాల నేపథ్యంలో పెంచ్‌ నదిపై ఉన్న మచగొరా ఆనకట్ట వద్ద వరదనీరు భారీగా చేరింది. దీంతో  అధికారులు ఆ ఆనకట్ట గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని కహర్‌.. భయంతో అక్కడే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి తలదాచుకున్నాడు. రాత్రంతా చెట్టుకు అతుక్కుపోయి బయటకు రాలేని నిస్సహాయ స్థితిలో అక్కడే ఉండిపోయాడు. అలా దాదాపు 24గంటల పాటు చెట్టుపైనే ఉండి అవస్థలు పడ్డాడు. అతడి స్నేహితులు మాత్రం ఎలాగోలా వరద నీటి బారి నుంచి తప్పించుకోగలిగారు. అనంతరం సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి అతడిని క్షేమంగా తీసుకొచ్చారు. 

గత వారం రోజులుగా మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 24గంటల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే, జబల్‌పూర్‌తో పాటు 10 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కూడా ప్రకటించింది. మరోవైపు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హౌసంగాబాద్‌ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని