అశోక్‌ గహ్లోత్‌ సోదరుడికి ఈడీ సమన్లు

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సోదరుడు అగ్రసేన్‌ గహ్లోత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎరువుల కుంభకోణం విషయంలో నమోదైన మనీలాండరింగ్‌ కేసులో బుధవారం దిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది..........

Published : 29 Jul 2020 09:08 IST

జైపుర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సోదరుడు అగ్రసేన్‌ గహ్లోత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎరువుల కుంభకోణం విషయంలో నమోదైన మనీలాండరింగ్‌ కేసులో బుధవారం దిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జులై 22న జోధ్‌పూర్‌లో అగ్రసేన్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. వీటిలో లభ్యమైన దస్త్రాల ఆధారంగా నేడు ఆయనను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న మరికొంత మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

2007-2009 మధ్య ఎరువుల కొనుగోలు, సరఫరాలో అవకతవకలు జరిగినట్లు కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ కేసు నమోదు చేసింది. 2013లో దీనిపై విచారణ ముగిసింది. తాజాగా జులై 13న చార్జిషీట్‌ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో ఆరోపించింది. వీటి ఆధారంగా ఇప్పుడు ఈడీ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మమేషన్‌ రిపోర్ట్‌’ నమోదు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న అగ్రసేన్‌ను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ‘అనుపమ్‌ కృషి’ అనే కంపెనీకి యజమాని అయిన అగ్రసేన్‌ ఎరువుల సరఫరాకు డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎరువుల్ని అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించి విక్రయించారన్నది ప్రధాన ఆరోపణ. డీలర్‌గా వ్యవహరిస్తున్న అగ్రసేనే దీనికి బాధ్యత వహించాలని ఈడీ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సంకట స్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, శాసనసభను సమావేశపరిచి తన బలాన్ని నిరూపించుకోవాలని గహ్లోత్‌ పట్టుదలతో ఉన్నారు. కానీ, గవర్నర్‌ నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో గహ్లోత్‌ సోదరుడికి సమన్లు అందడం చర్చనీయాంశంగా మారింది. భాజపా సర్కార్‌ కావాలనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏడేళ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని