కమల్‌నాథ్‌కు షాక్‌.. ఆ వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు!

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు ఎన్నికల కమిషన్‌ షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర మహిళా మంత్రిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా ఎన్నికల కమిటీకి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఈసీ బుధవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.

Published : 22 Oct 2020 01:25 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు ఎన్నికల కమిషన్‌ షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర మహిళా మంత్రిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా ఎన్నికల కమిటీకి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఈసీ బుధవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ మంగళవారం స్పందిస్తూ.. కమల్‌ ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తాను అంగీకరించనని స్పష్టం చేశారు. కాగా రాహుల్‌ వ్యాఖ్యలపై కమల్‌నాథ్‌ తిరిగి స్పందిస్తూ.. ‘నేను ఎవర్నీ అవమానించాలని అనుకోలేదు. నేను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఇప్పటికే వివరణ ఇచ్చాను. కాబట్టి ఎందుకు క్షమాపణ కోరాలి. ఒకవేళ ఎవర్నైనా నేను అవమానించినట్లు భావిస్తే ఇప్పటికే పశ్చాత్తాపం కూడా తెలిపా’అని అన్నారు. 

మధ్యప్రదేశ్‌లో దాబ్రా నియోజకవర్గ ఉపఎన్నికల ర్యాలీలో మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఆ రాష్ట్ర మహిళా మంత్రి ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై భాజపాతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సహా పలువురు నాయకులు మంగళవారం రెండు గంటల మౌనదీక్ష చేపట్టారు. కమల్‌నాథ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని