ట్రంప్‌తో కిమ్‌ చాలా విషయాలు చెప్పాడట!

నియంత పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఉత్తర కొరియా అంటే అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలకు ఒకింత ఆందోళనే. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడు రోజుకో కొత్త.......

Published : 10 Sep 2020 17:52 IST

వాషింగ్టన్‌: నియంత పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఉత్తర కొరియా అంటే అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలకు ఒకింత ఆందోళనే. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడు రోజుకో కొత్త ఆయుధ పరీక్షలతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసేవారు కిమ్‌. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న వేళ కిమ్‌ వార్తలకు ప్రాధాన్యం తగ్గింది. అయితే, తాజాగా మరోసారి కిమ్‌ వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- కిమ్‌ మధ్య 2018లో సింగపూర్‌ వేదికగా జరిగిన సమావేశంలో కిమ్‌.. ట్రంప్‌తో పలు కీలక విషయాలు పంచుకున్నారట. అమెరికాలో ప్రముఖ జర్నలిస్ట్‌ వుడ్‌వర్డ్స్‌ ‘రేజ్‌’ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో దీనికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. డిసెంబరు-జులైల మధ్య ట్రంప్‌తో వుడ్‌వర్డ్స్‌ జరిపిన 18 ఇంటర్వ్యూల్లో ట్రంప్‌ చెప్పిన విషయాల ఆధారంగా ఈ పుస్తకం రాశారు.

2018లో సింగపూర్‌లో ట్రంప్‌-కిమ్‌ మధ్య జరిగిన తొలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మొదటిసారి కిమ్‌ను కలిసినప్పుడు తాను ఎంతో ఆశ్చర్యానికి గురైనట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా అనేక విషయాలను కిమ్‌ తనతో పంచుకున్నారని ట్రంప్‌ వెల్లడించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడి తాను ఎదిగిన తీరును వెల్లడిస్తూ, తన అంకుల్‌ను ఏవిధంగా అడ్డు తొలగించుకున్నారో ఆ విషయాన్ని కూడా ట్రంప్‌తో కిమ్‌ పంచుకున్నారట. ఆ సమావేశంలో అణ్వాయుధాల విషయమై ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చ జరిగింది. అయితే, అణ్వాయుధాలను విడిచి పెట్టేందుకు ఉత్తరకొరియా సుముఖంగా లేదని సమావేశానికి ముందు నిఘా వర్గాలు ట్రంప్‌కు సమాచారం ఇచ్చాయి. దీని గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ప్యాంగ్యాంగ్‌ను ఎలా సమన్వయం చేయాలో సీఐఏకు అవగాహన లేదని అన్నారు. అంతేకాకుండా, ఇరువురి మధ్య జరిగిన మూడు సమావేశాల్లోనూ భారీ ఒప్పందాలు కుదరలేదన్న విమర్శలను ట్రంప్‌ ఖండించారు. 

రహస్య ఆయుధం

అమెరికా- ఉత్తర కొరియా మధ్య 2017 యుద్ధ వాతావరణం నెలకొన్న సమయం గురించి ట్రంప్‌ను వుడ్‌ ప్రశ్నించగా ఆసక్తికర విషయాన్ని ఆయన బయట పెట్టారు. తాము ఓ అణ్వాయుధాన్ని తయారు చేశామని, ఇంతకుముందు దేశంలో ఇలాంటి ఆయుధాన్ని ఎవరూ రూపొందించలేదని చెప్పారు. రష్యా, చైనా దేశాధ్యక్షులు పుతిన్‌, జిన్‌పింగ్‌ సైతం ఇలాంటి ఆయుధం గురించి విని ఉండొకపోవచ్చని పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆయుధం నిజమేనని తేలిందని వుడ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌ మాత్రం ఈ వార్తలను ఖండించారు.

మరోవైపు నల్లజాతీయులపై ఏళ్లుగా వివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ను ప్రశ్నించగా.. కరోనాకు ముందు నల్లజాతీయుల నిరుద్యోగిత రేటు తగ్గిందని, ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో జాత్యంహకారం తక్కువేనంటూ చెప్పుకొచ్చారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని