‘మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి’

‘మహారాష్ట్రలో మేము సురక్షితంగా ఉంటామని భావించడం లేదని’ శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మ కుటుంబం శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. తమ తండ్రిపై దాడి చేసిన నిందితులకు బెయిల్‌ ఇవ్వడంపై బాధిత కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 13 Sep 2020 01:15 IST

నిందితులకు బెయిల్‌ ఇవ్వడంపై బాధిత కుటుంబం ఆందోళన

ముంబయి: ‘మహారాష్ట్రలో మేము సురక్షితంగా ఉంటామని భావించడం లేదని’ శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మ కుటుంబం శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. తమ తండ్రిపై దాడి చేసిన నిందితులకు బెయిల్‌ ఇవ్వడంపై బాధిత కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడి ఘటనలో నిందితులైన శివసేన నాయకుడు కమలేశ్‌ కదం సహా మిగతా ఐదుగురిని పోలీసులు శనివారం బెయిల్‌పై విడుదల చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ బాధితుడి కుటుంబసభ్యులతో పాటు పలువురు భాజపా నాయకులు అదనపు కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. 

ఈ క్రమంలో బాధితుడి కుమార్తె షీలా శర్మ మాట్లాడుతూ... ‘దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి ఇలా బెయిల్‌ మంజూరు చేయడం తగదు. వారికి బెయిల్‌ ఇవ్వడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. పోలీసులు మా ఇంటికి వచ్చి విచారణ జరపాలి’అని ఆవేదన వ్యక్తం చేశారు. మదన్‌ శర్మ కుమారుడు సన్నీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మేము సురక్షితంగా ఉంటామని అనుకోవడం లేదు. రాష్ట్రపతి పాలన విధించాలి. లేదా రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని అన్నారు. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు సంబంధించి ఎగతాళి చేసేలా ఉన్న చిత్రాలను వాట్సాప్‌లో పోస్ట్ చేసినందుకు మదన్‌ శర్మ అనే నేవీ మాజీ అధికారిపై శివసేన కార్యకర్తలు శుక్రవారం దాడికి దిగిన విషయం తెలిసిందే. అతడి ఇంటికి వెళ్లి వెంబడించి మరీ చితకబాదటం అక్కడి సీసీ ఫుటేజీల్లో రికార్డయింది. వీడియో ఆధారంగా స్థానిక శివసేన నాయకుడు కమలేశ్‌ సహా ఐదుగురు నిందితులపై పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కేవలం వాట్సాప్‌లో ఫొటో పోస్ట్‌ చేసినందుకు ఒక మాజీ నేవీ అధికారిపై ఇంతలా దాడికి దిగడం ఏంటని ప్రశ్నిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని