బిహార్‌ ఎన్నికల్లో..వామపక్షాల హవా..!

మహాకూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న వామపక్ష పార్టీలు 17స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తున్నాయి. గతంలో మూడు స్థానాలకే పరిమితమైన కమ్యూనిస్టులకు ఈసారి దూసుకుపోవడం ఆ పార్టీలకు కొత్త ఉత్సాహానిస్తోంది.

Published : 10 Nov 2020 20:11 IST

పోటీచేస్తోన్న 29 స్థానాల్లో 18 చోట్ల ఆధిక్యం

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ పక్షం గెలుపు దిశగా పయణిస్తోంది. మరోవైపు విజయానికి దగ్గరయ్యామని అంచనాలు వేసుకున్న ఆర్‌జేడీ, ఎన్నికల పోరులో వెనుకబడింది. ఇక, ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీచేసిన ఎల్‌జేపీ కూడా ఎన్నికలో పోరులో వెనుకబడింది. వీరి పరిస్థితి ఇలా ఉంటే, మహాకూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న వామపక్ష పార్టీలు 17స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తున్నాయి. గతంలో మూడు స్థానాలకే పరిమితమైన కమ్యూనిస్టులకు ఈసారి ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి.

ఒకప్పుడు బిహార్‌లో మంచి ఓటు బ్యాంకు కలిగిన వామపక్షాలు గత దశాబ్దకాలంగా ఎన్నికల్లో వెనుకబడ్డాయి. 2015 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కేవలం మూడు సీట్లు మాత్రమే సాధించగలిగాయి. అవికూడా ఒక్క సీపీఐ(ఎంఎల్‌) మాత్రమే మూడుస్థానాల్లో గెలుపొందింది. కానీ, ఈసారి మాత్రం దాదాపు 17 స్థానాల్లో విజయం వైపు దూసుకెళ్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, సీపీఐ(ఎంఎల్‌) 12స్థానాల్లో ముందుండగా, సీపీఐ రెండు, పీసీఎం మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే సీపీఎం ఒకస్థానంలో విజయం సాధించింది. సీసీఐ(ఎంఎల్‌) పోటీ చేస్తోన్న 19 స్థానాల్లో దాదాపు 15చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో ఉండటం వల్ల ఈసారి వామపక్షాలకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీటికి స్థిరమైన ఓటు బ్యాంకు కలిగివుండడం కూడా విజయానికి దోహదపడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే, బిహార్‌లో ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం వైపు దూసుకెళ్తుండగా.. మహాకూటమి మాత్రం కాస్త వెనుకబడిపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపు మెరుగైన ఫలితాలే వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఎన్‌డీఏ నుంచి పోటీ ఎక్కువైంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 122 సీట్ల ఆధిక్యాన్ని ఎన్‌డీఏ చేరుకోగలిగింది. ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమి 95స్థానాల్లో గెలుపొందగా మరో 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మహాకూటమి మాత్రం 83స్థానాల్లో విజయం సాధించగా మరో 28 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని