చిరాగ్‌తో ఎన్డీయేకు సంబంధం లేదు: ఠాకూర్‌

బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న  రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎల్జేపీ నేత చిరాగ్‌ కేంద్రంలో భాజపాతో అనుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. భాజపా నాయకులు మాత్రం ఆ పార్టీపై విమర్శలు చేస్తుండడం గందరగోళం సృష్టిస్తోంది.

Published : 28 Oct 2020 00:46 IST

పట్నా: బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న  రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎల్జేపీ నేత చిరాగ్‌ కేంద్రంలో భాజపాతో అనుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. భాజపా నాయకులు మాత్రం ఆ పార్టీపై విమర్శలు చేస్తుండడం గందరగోళం సృష్టిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఎల్జేపీ నేత చిరాగ్‌ను ఎవరూ విశ్వసించరంటూ విమర్శలు చేశారు. ఆయన పార్టీతో ఎన్డీయేకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 

ఠాకూర్‌ మంగళవారం పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చిరాగ్‌ పాసవాన్‌ను ఎవరూ నమ్మరు. ఆయన పార్టీ మాతో పొత్తులో లేదు. ఎల్జేపీతో ఎన్డీయేకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి నితీశ్‌కుమారే. భారీ మెజారిటీతో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. 

ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ను ఉద్దేశించి ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘లాలూప్రసాద్‌ యాదవ్‌ వంశీయులను ఎప్పటికీ నమ్మలేం. పోస్టర్ల నుంచి తమ తల్లిదండ్రుల ఫొటోలు లేకుండా వాళ్లు ఏం చేయగలరు. వాళ్లు కులాల ఆధారంగా విభజన రాజకీయం చేస్తారు. వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో.. ప్రజలు అర్థం చేసుకోగలరు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఓటు వేసేటప్పుడు జాగ్రత్త పడాలి’ అని సూచించారు.

కాగా మరోవైపు కర్ణాటకకు చెందిన భాజపా యువ ఎంపీ తేజస్వీ సూర్య ఎల్జేపీ నేత చిరాగ్‌ను సోమవారం ప్రశంసించడం గమనార్హం. చిరాగ్‌ ఓ శక్తివంతమైన నేత, ప్రత్యేకమైన మిత్రుడని ప్రశంసించారు. బిహార్‌ సమస్యలను ఆయన పక్కాగా లేవనెత్తగలరన్నారు. ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని