వణుకుతోన్న ఉత్తరం..!

ఇప్పటికే కరోనా తీవ్రతతో వణుకుతున్న ఉత్తర భారతంపై చల్లని గాలుల ప్రభావం మరింత ఎక్కువకానుంది. ప్రస్తుతం శీతాకాలంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

Published : 29 Nov 2020 20:30 IST

రానున్న రోజుల్లో అతి శీతల వాతావరణం
భారత వాతావరణ శాఖ అంచనా

దిల్లీ: ఇప్పటికే కరోనా తీవ్రతతో వణుకుతున్న ఉత్తర భారతంపై చల్లని గాలుల ప్రభావం మరింత ఎక్కువకానుంది. ప్రస్తుతం శీతాకాలంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా, రానున్న మూడు నెలల్లో శీతల గాలులతో ఉత్తర, మధ్య భారతం వణికిపోయే అవకాశాలున్నాయని వెల్లడించింది.

‘ఉత్తర భారత్‌లో శీతల పవనాలు పెరగడంతో పాటు అత్యంత తీవ్రమైన శీతాకాలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్‌ మృత్యుంజయ్‌ మహోపాత్ర వెల్లడించారు. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాల ఉష్ణోగ్రతలను అంచనా వేసిన ఐఎండీ, వచ్చే మూడు నెలల్లో ఉత్తర, మధ్య భారత్‌లో సాధారణం కంటె తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో ఉత్తర భారత్‌ అతి శీతలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానూ, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అతి తక్కువగా ఉంటాయని ఐఎండీ చీఫ్‌‌ మృత్యుంజ‌య్‌ మహోపాత్ర వెల్లడించారు.

దశాబ్దిలో అత్యంత కనిష్ఠం..
దేశ రాజధానిలో నవంబర్‌ నెలలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నవంబర్‌ నెలలో దిల్లీలో సాధారణ ఉష్ణోగ్రతలు 12.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నాయి. గత సంవత్సరం మాత్రం 15 డిగ్రీలు ఉండగా, 2048లో 13.4 డిగ్రీలు, 2016, 2017లలో 12.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. కానీ, ఈసారి మాత్రం దిల్లీలో అత్యంత తక్కువగా పది డిగ్రీలకు పడిపోయాయి. నవంబర్‌ 1 నుంచి 29వ తేదీ వరకు సరాసరి ఉష్ణోగ్రతలు 10.3డి.సెల్సియస్‌గా రికార్డు అయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా గడిచిన పది సంవత్సరాల్లో నవంబర్‌ మాసంలో ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారని వెల్లడించింది.

ఇక, ఆదివారం నాడు దిల్లీలో 7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నవంబర్‌ 23వ తేదీన అత్యంత కనిష్ఠంగా 6.3డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఇక అక్టోబర్‌ నెలలోనూ ఎన్నడూ లేనంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దిల్లీలో గడిచిన 58 సంవత్సరాల్లో తక్కువ ఉష్ణోగ్రత నమోదైన మాసంగా ఈ అక్టోబర్ రికార్డుకెక్కింది. ఈసారి అక్టోబర్‌ నెలలో దిల్లీలో కనిష్ఠంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని