సాధారణ రైళ్లు ఎప్పుడో..ఇప్పుడే చెప్పలేం..

కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సాధారణ రైలు సేవల ప్రారంభ తేదీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ అన్నారు. ఇంకా సాధారణ పరిస్థితులు...

Published : 18 Dec 2020 17:09 IST

దిల్లీ: కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సాధారణ రైలు సేవల ప్రారంభ తేదీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని చెప్పారు. ఈ మేరకు దిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సాధారణ రైళ్లస్థానంలో ప్రస్తుతం 1,089 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని వీకే యాదవ్‌ అన్నారు. సాధారణ రైళ్లు మాత్రం ఎప్పుడు ప్రారంభించేది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఇప్పటికే జనరల్‌ మేనేజర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారన్నారు. సేవలను నెమ్మదిగా దశలవారీగా ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా రూ.4,600 కోట్ల ఆదాయం సమకూరిందని యాదవ్‌ తెలిపారు. అది 2021 మార్చి నాటికి రూ.15వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రయాణికుల విభాగంలో గతేడాది రూ.53వేల కోట్లు ఆదాయం వచ్చిందని, గతంతో పోలిస్తే 87 శాతం తక్కువగా ఉందని చెప్పారు. ప్యాసింజర్‌ విభాగంలో వచ్చిన నష్టాలను సరకు రవాణాతో భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే సరకు రవాణా విభాగం అనుకున్న లక్ష్యాన్ని 97 శాతం చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం ప్రయాణికుల రైళ్లలో సరాసరి 30 నుంచి 40 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటోందన్నారు. 

ఇవీ చదవండి..
ఆ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు..
రైతుల ఆందోళనలో బాలీవుడ్‌ నటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని