పరిహారం మొదటి భార్యకే: బొంబాయి హైకోర్టు

ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే, అతడి మరణానంతరం వచ్చే పరిహారం కేవలం మొదటి భార్యకే చెందుతుందని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇద్దరు భార్యల పిల్లలకు కూడా ఆ మొత్తంలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది...

Published : 25 Aug 2020 23:31 IST

ముంబయి: ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే, అతడి మరణానంతరం వచ్చే పరిహారం కేవలం మొదటి భార్యకే చెందుతుందని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇద్దరు భార్యల పిల్లలకు కూడా ఆ మొత్తంలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ కాతవల్లా, జస్టిస్‌ మాధవ్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సురేశ్‌ హటాంకర్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఆయన గత మే 30న కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారికి ఇచ్చే రూ.65 లక్షల పరిహారం లభించింది. దీనిని క్లెయిమ్‌ చేసుకునేందుకు ఇద్దరు భార్యలూ దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికివ్వాలన్న దానిపై అధికారులూ మల్లగుల్లాలు పడ్డారు. మరోవైపు తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పరిహారంలో వాటా ఇప్పించాల్సిందిగా రెండో భార్య కుమార్తె శ్రద్ధా బొంబాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండో భార్యకు ఎలాంటి పరిహారమూ లభించదని తీర్పునిచ్చింది. అయితే, రెండో భార్య పిల్లలకు మాత్రం వాటా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాది జ్యోతి చవాన్‌ మాట్లాడుతూ.. పరిహారం మొత్తాని కోర్టుకు సమర్పిస్తామని, ఎవరికి ఎంతివ్వాలన్నదానిపై కోర్టే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనానికి వివరించారు. ఈ అంశంపై గతంలో ఔరంగాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన భర్తకు రెండో భార్య ఉన్నట్లు తమకు తెలియదని మొదటి భార్య వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం గురువారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని