రైల్వే సేవలపై పంజాబ్‌ రైతుల కీలక నిర్ణయం!

పంజాబ్‌ రైతు సంఘాలు ఎట్టకేలకు రైల్వే ట్రాక్‌ల దిగ్బంధాన్ని విరమించేందుకు అంగీకారం తెలిపాయి. సీఎం అమరీందర్‌తో శనివారం చర్చలు జరిపిన అనంతరం రైతు సంఘాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. దీంతో నవంబర్‌ 23 రాత్రి నుంచి రాష్ట్రానికి రైల్వే సేవల పునరుద్ధరణ జరుగుతుందని అమరీందర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Published : 21 Nov 2020 22:38 IST

ఛండీగఢ్‌: పంజాబ్‌ రైతు సంఘాలు ఎట్టకేలకు రైల్వే ట్రాక్‌ల దిగ్బంధాన్ని విరమించేందుకు అంగీకారం తెలిపాయి. సీఎం అమరీందర్‌తో శనివారం చర్చలు జరిపిన అనంతరం రైతు సంఘాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. దీంతో నవంబర్‌ 23 రాత్రి నుంచి రాష్ట్రానికి రైల్వే సేవల పునరుద్ధరణ జరుగుతుందని అమరీందర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘రైతు సంఘాలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయి. నవంబర్‌ 23 రాత్రి నుంచి రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 15 రోజుల పాటు రైల్వే ట్రాక్‌ల దిగ్బంధనానికి విరామం ఇచ్చేందుకు రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ చర్య మన ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తెస్తుందని నేను భావిస్తున్నాను. ఇక పంజాబ్‌కు రైలు సేవల్ని పునరుద్ధరించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను’ అని సింగ్‌ పేర్కొన్నారు. చర్చల్లో రైతు సంఘాల నాయకులు స్పందింస్తూ..‘కేంద్రం త్వరగా చర్చలకు వస్తే రాబోయే 15 రోజుల పాటు రైల్వే సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఒకవేళ చర్చలు చేపట్టకపోతే నిరసనలు తిరిగి మొదలవుతాయి’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు సెప్టెంబర్‌ 24 నుంచి నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. రైతులు రైల్వే ట్రాక్‌లపై నిరసన కార్యక్రమాలు చేపడుతుండటంతో రైల్వే శాఖ పంజాబ్‌కు సేవల్ని నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి గూడ్స్‌ రైళ్లు రాకపోకలు నిలిచిపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు, నిత్యావసరాలు, వ్యవసాయానికి ఎరువుల తదితర వస్తువుల కొరత ఏర్పడి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మొత్తం 3వేలకు పైగా సరకు రవాణా, 2వేలకు పైగా ప్యాసింజర్‌ రైళ్లపై ఈ ప్రభావం పడింది. కాగా పంజాబ్‌లో నిరసనల కారణంగా రూ.2వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైల్వే శాఖ శుక్రవారం వెల్లడించింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని