మాస్క్‌ ధరించకపోతే  ₹ 2వేలు జరిమానా

దేశ రాజధాని నగరాన్ని కరోనా వణికిస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనివారికి రూ.2వేలు జరిమానా విధించనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు...........

Updated : 19 Nov 2020 17:44 IST

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన

దిల్లీ: దేశ రాజధాని నగరాన్ని కరోనా వణికిస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనివారికి రూ.2వేలు జరిమానా విధించనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇప్పటివరకు రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలకు పెంచినట్టు ఆయన తెలిపారు. గురువారం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో కరోనా వైరస్‌ ప్రభావం దృష్ట్యా అదనంగా ఐసీయూ బెడ్‌లు, ఇతర వసతులు సమకూర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. 

కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దిల్లీ ప్రజలకు ఇది కష్టకాలమని అఖిలపక్ష పార్టీల సమావేశంలో చెప్పానన్నారు. ఇది రాజకీయాలకు, పరస్పర నిందారోపణలకు సమయం కాదని, అందరం కలిసికట్టుగా ప్రజలకు సేవ చేయాల్సిన తరుణమన్నారు. అందువల్ల కొంత కాలం రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు సేవలందించాలనే తన సూచనలను అన్ని రాజకీయ పార్టీలూ అంగీకరించాయన్నారు. 

దిల్లీలో ఛత్‌పూజను అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కానీ 200 మంది ఒకేసారి నది వద్దకు వెళ్తే.. వారిలో ఏ ఒక్కరిలోనైనా కొవిడ్ ఉంటే మిగతా వారికి ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో కరోనా వైరస్‌ కేసులు అధికంగా ఉన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఛత్‌ పూజపై ఎలాంటి నిషేధం విధించడంలేదన్న ఆయన.. ఒకేసారి భారీ సంఖ్యలో జనం నది వద్దకు వెళ్లడంపై నిషేధం విధించామన్నారు. ఈ వేడుకలను ఇళ్లలోనే జరుపుకొందామని విజ్ఞప్తి చేశారు.

బుధవారం ఒక్కరోజే దిల్లీలో 7486 కొత్త కేసులు నమోదవ్వడంతో నగరంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేసింది. అలాగే, గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 131మంది మరణించడం కలకలం రేపుతోంది. దిల్లీలో ఇప్పటివరకు 4.52లక్షల మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 42వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ఇదీ చదవండి

వైరస్‌ విజృంభిస్తున్నా ఎందుకు మేల్కొనలేదు?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని