ఆత్మహత్యలపై  మీ వైఖరి తేల్చండి

ఆత్మహత్యలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది.

Published : 12 Sep 2020 19:56 IST

కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం

దిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం, భారతీయ శిక్షా స్మృతితో విభేదించటంతో.. ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్‌ 309 ఆత్మహత్యను శిక్షార్హమైన నేరంగా స్పష్టం చేయగా.. 2017 నాటి మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం లోని సెక్షన్‌ 115, ఆత్మహత్య తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన సంభవించే పరిణామంగా పేర్కొనడం పరస్పర విరుద్ధంగా ఉందని సుప్రీం వెల్లడించింది.

జంతువుల ముందుకు దూకి..

జంతుప్రదర్శన శాలల్లో క్రూర జంతువుల ముందు దూకి ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల ప్రయత్నాలను ఆపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ఏనుగు ఉన్న చోటికి దూకటంతో.. అతడిని రక్షించే ప్రయత్నంలో ఏనుగును చిత్రహంసకు గురిచేయటంపై జంతుహక్కుల కార్యకర్త సంగీతా డోగ్రా పిటిషన్‌ వేశారు. ఈ విధమైన ఆత్మహత్యా ప్రయత్నాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం, సెంట్రల్‌ జూ అథారిటీలను ఆదేశించాలంటూ ఆమె తన విజ్ఞాపనలో కోరారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి. రామసుబ్రహ్మణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

మానసిక ఒత్తిడి మాత్రమే కారణం కాదు

ఆత్మహత్యకు కారణం మానసిక ఒత్తిడే కారణం కానవసరం లేదని, నిరసన కూడా కావచ్చని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అభిప్రాయపడ్డారు. ఇందుకు వియత్నాంకు చెందిన సన్యాసులను ఉదహరించారు.  పూర్తి మానసిక ప్రశాంతతతో ఉండే వీరు.. సంధారా అనే విధానం ద్వారా ప్రపంచ బంధనాల నుంచి విముక్తి పొందటాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిని ఆత్మహత్యగా పరిగణించలేమని ఆయన తెలిపారు.

ఈ కేసు విచారణలో మాజీ ఆదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఏఎన్‌ఎస్‌ నాదకర్ణిని అమికస్‌ క్యూరీగా నియమించారు. ఈ మేరకు కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలంటూ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని