
చివరికి గాంధీ విగ్రహాన్నీ వదల్లేదు: ట్రంప్
మహాత్ముడు శాంతినే కోరుకున్నారు
వాషింగ్టన్: ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ మృతి అనంతరం నిరసనకారులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనకారులను ‘దుండగుల ముఠా’ అంటూ మండిపడ్డారు. శ్వేతజాతీయుడైన పోలీసు కర్కశత్వానికి మే 25న ఫ్లాయిడ్ బలైన సంగతి తెలిసిందే. మృతుడి చేతులకు బేడీలు వేసి, మెడపై ఎనిమిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి పెట్టిన పోలీసు తీరు ఓ వీడియో ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో ఫ్లాయిడ్ తనకు శ్వాస ఆడటం లేదని, వదిలేయమని వేడుకోవడం కనిపిస్తుంది. కానీ ఆ అధికారి అవేవీ పట్టించుకోకపోవడంతో అతడి ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నిరసనకారుల ఆగ్రహం అల్లర్లు, విధ్వంసం, దోపిడీలకు దారితీసింది. ఆ క్రమంలో కొందరు దుండగులు వాషింగ్టన్లోని గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో పర్యటించిన ట్రంప్ మాట్లాడుతూ..‘మీకు తెలుసా, వారు అబ్రహాం లింకన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ విగ్రహాన్ని తాకేప్పుడు, నేను ఒక నిమిషం ఆగమని చెప్తాను. వారు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్ విగ్రహాలపైనా దాడి చేశారు. ఎవరినీ వదిలిపెట్టలేదు. చివరికి గాంధీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. గాంధీ ఎప్పుడూ శాంతినే కోరుకున్నారు కదా! వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదని నేను అనుకోవట్లేదు. వారంతా దుండగుల ముఠా కావొచ్చు’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే ఉత్తర్వులపై సంతకం చేసినట్లు ప్రచారానికి హాజరైన ప్రజలకు వెల్లడించారు.
‘వారు వేటిని కూలగొడుతున్నారో వారికి తెలీదు. కానీ, మనకు ఆలోచన ఉంది. వారు మన గతాన్ని, చరిత్రను ధ్వంసం చేస్తున్నారు. కొద్దిపాటి ఆనందానికి..10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తారు’ అని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని హెచ్చరించారు. గత నాలుగు నెలల కాలంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
Advertisement