
ఆ విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్!
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
వాషింగ్టన్: ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉత్తర్వులపై ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన పాలకవర్గం మసాచుసెట్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ డి బరోకు తెలిపింది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు వినిపిస్తూ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు.
విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దాదాపు 200 పైగా విద్యా సంస్థలు వీటిపై సంతకాలు చేశాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలు సైతం ఈ విషయంపై కోర్టుకు వెళ్లాయి. వీరికి సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలూ మద్దతుగా నిలిచాయి. మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఆన్లైన్ తరగతులపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేస్తూ మార్చి 13న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) తీసుకున్న నిర్ణయానికి ట్రంప్ తాజా ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని కోర్టులో వాదనల సందర్భంగా హార్వర్డ్, ఎంఐటీ వాదించాయి.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్ జులై 6న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేదా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే విద్యాబోధన అందించే వర్సిటీలకు మారాలని సూచించారు. దీంతో ప్రాంగణ కోర్సులు అందించే విద్యాసంస్థలకు మారడమా లేక స్వదేశానికి తిరుగు ప్రయాణం కట్టడమా తేల్చుకోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. ఎఫ్-1 వీసాపై అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతోపాటు, ఎం-1 వీసాపై వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్నవారు తీవ్ర గందరగోళంలో పడ్డారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థల్ని ఎలాగైనా తెరిపించాలన్న దురుద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం విద్యార్థులకు ఊరట కలిగించింది.