‘అమెరికా చర్యలతో పెద్ద ప్రమాదమే జరిగుండేది’

అమెరికాకు చెందిన ఓ నిఘా విమానం ఇటీవల తమ అధీనంలో ఉన్న గగనతలంలోకి ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ఆ ప్రాంతం ‘నో ఫ్లై’ జోన్‌గా ఉందని.. అక్కడ తాము తరచూ ‘లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌’ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది.........

Published : 26 Aug 2020 11:21 IST

అగ్రరాజ్యంపై చైనా ఆగ్రహం

బీజింగ్‌: అమెరికాకు చెందిన ఓ నిఘా విమానం ఇటీవల తమ అధీనంలో ఉన్న గగనతలంలోకి ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ఆ ప్రాంతం ‘నో ఫ్లై’ జోన్‌గా ఉందని.. అక్కడ తాము తరచూ ‘లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌’ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది. అగ్రరాజ్యపు చర్యలు చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి వూ కియాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. 

అమెరికాకు చెందిన ‘యూ-2 రికనైసాన్స్‌ జెట్‌’ ఇటీవల ఉత్తర చైనా ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్య పెద్ద ప్రమాదానికి దారి తీసి ఉండేదని అక్కడి విదేశాంగ శాఖ అభిప్రాయపడ్డట్లు వెల్లడించాయి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి. 

ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ చైనా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య, సైనిక, రాజకీయ పరంగా ఉభయ దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ, హాంకాంగ్‌ అల్లర్లు, భారత్‌-చైనా సరిహద్దు వివాదం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రాదేశిక దురాక్రమణలను సవాల్‌ చేస్తూ తైవాన్‌, దక్షిణ చైనా సుముద్రం వంటి ప్రాంతాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడం డ్రాగన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని