Galwan:గల్వాన్‌ ఘటనతో చైనాకు పాఠం..!

సరిహద్దుల వెంట గల్వాన్‌, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు భారత సీడీఎస్‌ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ ..

Updated : 29 Feb 2024 14:08 IST

 సీడీఎస్ బిపిన్‌ రావత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సరిహద్దుల వెంట గల్వాన్‌, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు భారత సీడీఎస్‌ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. ఆయన ఒక ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా సైనికులు స్వల్పకాలానికి మాత్రమే దళాల్లో చేరతారని పేర్కొన్నారు. దీంతో హిమాలయ పర్వత ప్రాంతాల్లో పోరాడేందుకు వారికి తగినంత అనుభం, శిక్షణ లభించదని రావత్‌ పేర్కొన్నారు. 

‘‘గల్వాన్‌, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది.  అక్కడ సైనికులుగా సాధారణ పౌరులను తీసుకొంటారు. వారు స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తారు. దీంతో ఇలాంటి పర్వత ప్రాంతాల్లో విధి నిర్వహణకు చైనా ఇచ్చే శిక్షణ సరిపోదు. టిబెట్‌ భౌగోళికంగా చాలా కష్టమైంది. ఇక్కడ పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలి. వాతావరణానికి అలవాటు పడాలి. భారత సైనికులు ఈ ప్రాంత వాతావరణానికి తేలికగా అలవాటు పడతారు. మన దళాలు పలు పర్వత ప్రాంతాల్లో నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ, చైనా అలాకాదు.  ఆ దేశ కదలికలపై భారత్‌  నిఘా వేసి ఉంచింది’’ అని రావత్‌ పేర్కొన్నారు. 

భారత్‌కు ఉత్తర సరిహద్దులు ఎంత కీలకమో.. పశ్చిమ సరిహద్దులు కూడా అంతే కీలకమని రావత్‌ పేర్కొన్నారు. ఉత్తర సరిహద్దుల్లో ఉండే సైనికులు అవసరమైతే పశ్చిమ సరిహద్దులను కాపాడేలా మోహరించామని తెలిపారు.   ఉత్తర సరిహద్దుల వద్ద పరిస్థితిని బట్టి మరిన్ని బలగాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

వేసవిలో కొంచెం పరిస్థితి అనుకూలించగానే ఇటీవల చైనా మూకలు మళ్లీ ఆయుధాలతో వాస్తవాధీన రేఖ వెంట చేరిపోయాయి. గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌ల‌లో  చైనా దళాల కదలికలు ఉన్నాయి.  చైనా సరిహద్దుల వెంట అనుసరించే వ్యూహాన్ని ఏ2ఏడీ అంటారు.  అంటే ‘యాంటీ యాక్సెస్‌- ఏరియా డినైల్‌’! ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో కూడా ఇదే వ్యూహాన్ని పాటిస్తోంది. తొలుత ప్రత్యర్థులను అడ్డుకొనేందుకు తన వద్ద ఫైటర్‌ జెట్లు, యుద్ధనౌకలు, బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణులను కీలక లక్ష్యాలపైకి గురిపెడుతుంది. అంతేకాదు.. ఇటీవల స్టెల్త్‌ యుద్ధవిమానం షియాన్‌ హెచ్‌-20 స్ట్రాటజిక్‌ బాంబర్లను సరిహద్దుల్లోని హోటన్‌ విమానాశ్రయం వద్దకు తరలించింది. ఇది లద్దాఖ్‌కు అత్యంత సమీపంలో ఉంది. వ్యూహాత్మక ఆధిపత్యం కోసం చైనా షియాన్‌ హెచ్‌-20 ఫైటర్‌ జెట్‌లను మోహరించింది. జూన్‌ 8వ తేదీ నుంచి వీటి సామర్థ్యాన్ని పరీక్షించడం మొదలుపెట్టింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని