Agnipath: ‘అగ్నిపథ్‌’పై నిరసనలు.. ఆ అంశాలపై కేంద్రం క్లారిటీ!

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం ‘అగ్నిపథ్‌’ (Agnipath) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Updated : 17 Jun 2022 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం ‘అగ్నిపథ్‌’ (Agnipath) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీస్‌ మాత్రమేనా అంటూ సైన్యంలో చేరాలనుకునే యువకులూ ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ పథకంపై నెలకొన్న అపోహలపై కేంద్ర క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. మరి ఈ పథకంలో ఉన్న అపోహలేంటి? కేంద్రం ఏం చెబుతోంది? అనే అంశాలను ఓ సారి చూద్దాం..

* ‘అగ్నిపథ్‌’ నాలుగేళ్ల సర్వీస్‌ మాత్రమే? మరి ఆ తర్వాత ఏంటి పరిస్థితి?

‘అగ్నిపథ్’ పథకంలో నాలుగేళ్ల సర్వీస్‌ అనేది చాలా తక్కువ సమయమని.. సర్వీస్ అయిపోయాక పరిస్థితి ఏంటనేది ఇటీవల తలెత్తిన ప్రధాన సమస్య. అయితే, అగ్నివీర్‌లుగా సేవలందించిన వారు తర్వాత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటే వారికోసం ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకాలు లభిస్తాయని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంకా పై చదువులు చదవాలనుకునే వారికి 12వ తరగతికి సమానమైన సర్టిఫికేట్ అందిస్తామని.. ఇది బ్రిడ్జ్‌ కోర్సు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. అంతేకాదు తర్వాత ఉద్యోగం చేయాలనుకునేవారికి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో (సీఏపీఎఫ్‌), రాష్ట్ర పోలీసు శాఖలో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపింది. అదేవిధంగా ఇతర రంగాలలో రాణించాలనుకునే వారికి అనేక అవకాశాలు లభిస్తాయని వివరించింది. 

* సైన్యంలో యువతకు అవకాశం తగ్గుతుందా?

‘అగ్నిపథ్‌’పై నెలకొన్న మరో సందేహమేంటంటే.. సైన్యంలో సేవలు అందించే అవకాశం యువతకు తగ్గుతుందా? దీన్ని అపోహగా కొట్టివేస్తూ.. సైన్యంలో అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ‘ప్రస్తుతం జరిగే ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్ల కన్నా రాబోయే రోజుల్లో అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్‌ మూడు రెట్లు పెరుగుతుంది’ అని తెలిపింది. 

* రెజిమెంటల్ వ్యవస్థ దెబ్బతింటుందా?

‘అగ్నిపథ్‌’ పథకం వల్ల సైన్యంలో పెద్ద సంఖ్యలో ఉన్న బెటాలియన్‌లో రెజిమెంటల్ బంధం (regimental bonding) దెబ్బతింటుందనేది మాజీ సైనాధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, రెజిమెంటల్ వ్యవస్థలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఉత్తమమైన అగ్నివీరులను ఎంపిక చేయడం వల్ల ఈ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

* సాయుధ బలగాల సంఖ్య తగ్గుతుందా?  

అగ్నిపథ్‌ వల్ల సాయుధ బలగాల సంఖ్య తగ్గుతుందనే అపోహ మాత్రమేనని ప్రభుత్వం పేర్కొంది. మొదటి సంవత్సరంలో రిక్రూట్ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో(armed forces) 3 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

* నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి తిరిగి తీసుకుంటారా?

నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తయి తిరిగి సైన్యంలో చేరాలనుకునే వారిని పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక చేసిన వారిని శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. వీరంతా 15 ఏళ్ల పాటు నాన్‌ ఆఫీసర్‌ ర్యాంకులో పనిచేయాల్సి ఉంటుంది.

* 21 ఏళ్ల వయసు వారిని నియమించడం సరియైనదేనా?

అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు కనీసం వయోపరిమితి పదిహేడున్నర సంవత్సరాల నుంచి అత్యధికంగా 21 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. అయితే, 21 ఏళ్ల వారికి దేశ సైన్యం మీద అంత అవగాహన ఉండదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ.. ప్రపంచంలోని చాలా దేశాలు సైన్యంలో యువతపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత పథకం ద్వారా సైన్యంలో అనుభవం ఉన్నవారి కంటే యువత సంఖ్య ఎప్పటికీ ఎక్కువగా ఉండబోదని కూడా స్పష్టం చేసింది. అగ్నిపథ్ ద్వారా ఇరువురి సంఖ్య చెరి సమానంగా ఉంటుందని.. దీనికి ఇంకా చాలా సమయం పడుతుందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని