Amar Jawan Jyoti: చారిత్రక ఘట్టం.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర్‌ జవాన్‌ జ్యోతి విలీనం

దేశ చర్రితలో మరో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. రాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్‌ జవాన్‌ జ్యోతికి స్థాన చలనం కలిగింది

Published : 21 Jan 2022 17:12 IST

దిల్లీ: దేశ చర్రితలో మరో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. రాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్‌ జవాన్‌ జ్యోతి (Amar Jawan Jyoti)కి స్థాన చలనం కలిగింది. ఈ జ్యోతిని అమర్‌ జవాన్ల స్మారకానికి 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం (National War Memorial) వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేశారు. చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ బీఆర్‌ కృష్ణ పర్యవేక్షణలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సైనిక లాంఛనాల నడుమ ఈ ఘట్టం పూర్తయ్యింది. తొలుత ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక కాగడాతో అమర్‌ జవాన్‌ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి జ్వాలలో ఈ జ్యోతిని విలీనం చేశారు. 

అమర్‌ జవాన్‌ జ్యోతి గురించి గురువారం నుంచి అనేక కథనాలు వచ్చాయి. తొలుత ఈ జ్యోతిని పూర్తిగా ఆర్పివేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం జ్యోతిని ఆర్పివేయట్లేదని స్పష్టం చేసింది. అమర్‌ జవాన్‌ జ్వాలను తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతిలో కలుపుతున్నట్లు వెల్లడించింది. ఇండియా గేట్‌ వద్ద ఉన్న స్మారకం వద్ద అమర జవాన్ల పేర్లు లేనందున అక్కడ జ్యోతి వెలుగుతూ ఉండటం వారికిచ్చే నిజమైన నివాళి అనిపించుకోదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారని, అక్కడే ఈ జ్యోతి కూడా వెలిగితే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లు అవుతుందని తెలిపింది. 

1971లో భారత్‌-పాక్‌ యుద్ధం (Indo - Pak war)లో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేట్‌ వద్ద స్మారకం నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్‌ జవాన్‌ జ్యోతిని వెలిగించారు. అయితే ఆ తర్వాత దేశ రాజధానిలో రూ.176 కోట్లతో 40 ఎకరాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. అక్కడ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్‌ ఫలకాలపై లిఖించారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నుంచి ఇండియా గేట్‌ వద్ద జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను జాతీయ యుద్ధ స్మారకం వద్దకు మార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని