Punjab Congress: నాకొద్దు ఆ సీఎం పోస్టు..!

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నేత అంబికా

Updated : 19 Sep 2021 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నేత అంబికా సోనీకి సీఎం పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. కానీ, ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సునీల్‌ జఖార్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా, రాజీందర్‌ సింగ్‌ భజ్వా, బ్రహ్మ్ మహీంద్ర, విజయేందర్‌ సింఘ్లా, కౌల్జిత్‌ సింగ్‌ నాగ్ర వంటి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.

గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్రురాలిగా అంబికా సోనీకి పేరుంది. 1969లో ఇందిరాగాంధీ ప్రేరణతో ఆమె పార్టీలో చేరారు. ఆమె తండ్రి అమృత్‌సర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. నెహ్రూతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అంబికా సోనీ తొలినాళ్లలో సంజయ్‌ గాంధీతో కలిసి పార్టీ కోసం పనిచేశారు. పలుమార్లు పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

గత కొంత కాలంగా కెప్టెన్‌-సిద్ధూ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తడం.. ఇద్దరి మధ్యా పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారడంతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అధిష్ఠానం జోక్యంతో అప్పట్లో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనబడినా.. ఇటీవల మళ్లీ వార్‌ మొదలైంది. పార్టీలో అంతర్గత విభేదాలతో విసిగిపోయానని.. ఇలాంటి అవమానాలు ఇకపై భరించే శక్తి తనకు లేదంటూ ఆయన రాజీనామా చేయడం గమనార్హం. పార్టీ అధిష్ఠానం కూడా సిద్ధూకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా లేకపోలేదు. సిద్ధూకి ప్రజల్లో క్రేజ్‌ ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఈ వ్యవహారంపై పట్టించుకోనట్లు ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన కెప్టెన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే మూడు సార్లు అవమానాలు ఎదుర్కొన్నానని.. ఇక తనవల్ల కాదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్‌లో చెప్పానని ఆయనే వెల్లడించారు. అలాగే, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో పార్టీ అధిష్ఠానం ఇష్టమన్న కెప్టెన్‌.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని