Anand Mahindra: నా కారుకు పేరు పెట్టండి: ఆనంద్‌ మహీంద్రా

ఇటీవల విడుదలైన స్కార్పియో-ఎన్‌ కారు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చేతికొచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆ కారుకు ఓ పేరును సూచించాలని నెటిజన్లను కోరారు.

Published : 08 Oct 2022 01:08 IST

దిల్లీ: మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకి బాగా నచ్చిన అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. మహీంద్రా సంస్థ రెండు నెలల క్రితం ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్‌ మోడల్‌ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెండు వారాల క్రితమే డెలివరీలు మొదలయ్యాయి. తాజాగా సంస్థ ప్రతినిధి ఆనంద్‌ మహీంద్రాకు కారు తాళాలు అందించారు. దీన్ని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘ ఇవాళ నాకు చాలా అద్భతుమైన రోజు. స్కార్పియో-ఎన్‌ కారు నా చేతికొచ్చింది. దీనికి ఓ మంచి పేరు కావాలి. అందుకే ఎవరైనా సూచిస్తే స్వాగతిస్తాను’’ అంటూ రాసుకొచ్చారు.

మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లో స్కార్పియో-ఎన్‌ మూడో తరం. గత ఇరవై ఏళ్లలో రెండు మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వాహనాలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. స్కార్పియో-ఎన్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.11.99 లక్షలుగా ఉంది. 5 వేరియంట్స్‌లో 9 రంగుల్లో లభ్యమవుతోంది. జులై 31న బుకింగ్‌లు ప్రారంభం కాగా..  తొలి నిమిషంలోనే 25వేల మంది బుక్‌ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. అత్యంత వేగంగా తొలి లక్ష కార్ల బుకింగ్స్‌ పూర్తి చేసుకొని  స్కార్పియో-ఎన్‌ రికార్డు సృష్టించింది. తొలి 25 వేల మంది వినియోగదారులు కారును పొందేందుకు ప్రస్తుతం 4 నెలల సమయం పడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని