Anju: పిల్లలపై బెంగ.. ‘అంజూ’ భారత్‌కు రానుందట!

భారత్‌కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ వెళ్లి, అతడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె వచ్చే నెలలో భారత్‌కు రానుందట!

Published : 17 Sep 2023 21:46 IST

ఇస్లామాబాద్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు చెందిన అంజూ (Anju) అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ వెళ్లి, అతడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే.. ఆమె వచ్చే నెలలో భారత్‌కు రానుందట! అంజూ మానసిక వేదనతో సతమతం అవుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు పాక్‌లో ఆమెను పెళ్లాడిన నస్రుల్లా ఓ వార్తాసంస్థతో తెలిపాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో భారత్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

ఫాతిమా (అంజూ) వచ్చే నెలలో భారత్‌కు తిరిగి వెళ్తుందని నస్రుల్లా తెలిపాడు. ఇటీవలి పరిణామాలతో ఆమె మానసిక వేదనకు గురవుతోందని, దీంతోపాటు తన పిల్లలను కోల్పోతోన్న భావన ఆమెకు కలుగుతోందని చెప్పాడు. ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదని చెబుతూ.. ఆమె తన పిల్లలను కలవడానికి తన దేశానికి వెళ్లడం మంచిదని అన్నాడు. భారత్‌కు తిరిగి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని తెలిపాడు. పాకిస్థాన్‌లో డాక్యుమెంటేషన్ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, వచ్చే నెలలో ఆమె భారత్‌కు వెళ్లే అవకాశం ఉందని చెప్పాడు. ఒకవేళ వీసా మంజూరైతే తానూ వెళ్తానన్నాడు.

అంజూ నిర్వాకం.. భర్త బెంచ్‌కు, సోదరుడు ఇంటికి..!

ఇదిలా ఉండగా.. అంజూకు ఇదివరకే వివాహమై, 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. పాక్‌లో వివాహం తర్వాత అంజూ పేరు ఫాతిమాగా మారింది. ఆ జంటకు అక్కడ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని మొహసీన్‌ ఖాన్‌ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. తాను కొన్ని పాష్తో పదాలు నేర్చుకున్నానని, పాక్‌లో ఇంత పేరు వస్తుందని ఇక్కడికి రాకముందు తనకు తెలియదని అంజూ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని