Arvind Kejriwal:భాజపా అవకాశమివ్వలేదు కదా... ఆసక్తి ఉంటే ఆప్‌ నుంచి పోటీ చేయండి!

గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిసారి ఆప్‌ పార్టీ గోవాలో పోటీ చేస్తున్న సందర్భంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ గోవాకి వెళ్లి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.

Updated : 17 Jan 2022 15:52 IST

గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌ తనయుడికి కేజ్రీవాల్‌ ఆఫర్‌

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిసారి ఆప్‌ పార్టీ గోవాలో బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ గోవాలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం గోవాలోని సెయింట్ ఆండ్రీ, షిరోడా కోర్టాలిమ్ వంటి కీలక నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారాల్లో పాల్గొన్నారు. 13 పాయింట్ల అజెండాను ప్రకటించారు. విద్యా, వైద్యం, వ్యాపారం, జీవనోపాధి, మైనింగ్‌, మౌలిక వసతులు సహా పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టనున్నట్లు  చెప్పారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌.. ఆప్‌ పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు. ఇటీవలే భాజపాలో చేరుదామనుకున్న ఉత్పల్‌కు చుక్కెదురైంది. కేవలం మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడని మాత్రమే ఉత్పల్‌కు టికెట్‌ ఇవ్వలేమంటూ గోవా భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యానించారు. భాజపా తరఫున పోటీ చేసేందుకు ఉత్పల్‌ అనర్హుడని ఫడణవీస్‌ తేల్చి చెప్పారు. దీంతో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పనాజీ నుంచి పోటీ చేయాలి భావించిన ఉత్పల్‌కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం భాజపా నేత అటానాసియో మోన్సెరటే పనాజీ నియోజకవర్గం నుంచి భాజపా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉత్పల్‌కు సంజయ్‌ రౌత్‌ మద్దతు..

ఇదిలా ఉండగా.. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఉత్పల్‌కు మద్దతుగా నిలిచారు. దివంగత మనోహర్‌ పారికర్‌కు నిజమైన నివాళి అర్పించేందుకు ఉత్పల్‌ను గెలిపించాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘పనాజీ నియోజకవర్గం నుంచి ఉత్పల్‌  కనుక స్వతంత్రంగా బరిలో దిగినట్లైతే.. అక్కడి నుంచి పోటీచేసే ప్రధాన పార్టీలు (ఆప్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌)లతో పాటు ప్రాంతీయ పార్టీ (గోవా ఫార్వాడ్‌) అతనికి మద్దతుగా అభ్యర్థులను బరిలోకి దింపకూడదు. ఇదే మనోహర్‌ భాయ్‌కి మనిమిచ్చే నిజమైన నివాళి’’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని