Amravati Killing: అమరావతిలో కెమిస్ట్‌ హత్య..: హంతకుడు సుశిక్షితుడే..!

అమరావతికి చెందిన కెమిస్ట్‌ ఉమేశ్‌ కొల్హే హత్య పథకం ప్రకారమే జరిగినట్లు దర్యాప్తులో తేలుతోంది. అతని హత్యలో శిక్షణ పొందిన హంతకుడే పాల్గొనట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

Published : 03 Jul 2022 18:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమరావతికి చెందిన కెమిస్ట్‌ ఉమేశ్‌ కొల్హే హత్య పథకం ప్రకారమే జరిగినట్లు దర్యాప్తును చూస్తే తెలుస్తోంది. శిక్షణ పొందిన హంతకుడే అతని హత్యలో పాల్గొనట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా శవపరీక్షలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఉమేశ్‌ గొంతుపై ఐదు అంగుళాల వెడల్పు, ఏడు అంగుళాల పొడవు, ఐదు అంగుళాల లోతుతో గాయం ఉన్నట్లు గుర్తించారు. దాడి చేసిన వెంటనే బాధితుడు మరణించేట్లు హంతకుడు జాగ్రత్త తీసుకొన్నట్లు తేలింది. హంతకుడు ఇటువంటి దాడులు చేయడంలో శిక్షణ పొందినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఉమేష్‌పై దాడికి పదునైనా ఆయుధాన్ని వినియోగించినట్లు భావిస్తున్నారు.

ఉదయ్‌పూర్‌లో దర్జీ హత్యకు వారం ముందు అమరావతిలో జూన్‌ 21న ఉమేష్‌ ప్రహ్లాద్‌రావ్‌ కొల్హేను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత గొడవలు, దొంగతనం ఈ హత్యకు కారణం కావొచ్చని తొలుత భావించగా.. ఆ దిశగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఉమేశ్‌ కూడా దర్జీ మాదిరిగానే సామాజిక మాధ్యమాల్లో నుపుర్‌ శర్మకు మద్దతు పలికారని భాజపా వెల్లడించింది. ఉమేశ్‌ గొంతుకోసి హతమార్చినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు శనివారం  కేంద్రమంత్రి అమిత్‌ షా ఆదేశాలు ఇచ్చారు.

ఈ కేసుకు సంబంధించిన విచారణ ఫాస్ట్‌ ట్రాక్‌లో నిర్వహించాలని ఉమేశ్‌ సోదరుడు ఆదివారం డిమాండ్‌ చేశారు. నిందితులు కఠిన శిక్షను విధించాలని కోరారు. నిందుతుల్లో ఒకరైన యూసఫ్‌ ఖాన్‌ 2006 నుంచి తన సోదరుడికి స్నేహితుడని వెల్లడించాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ముదస్సిర్‌ అహ్మద్‌, షారుఖ్‌ పఠాన్‌, అబ్దుల్‌ తౌఫిక్‌ షేక్‌, షోయబ్‌ ఖాన్‌, అతీక్‌ రషీద్‌లను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని