ఆయుర్వేద రంగంలో 90శాతం వృద్ధి!

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం పెరగడంతో పాటు ఈ రంగంలో దాదాపు 90శాతం వృద్ధి కనిపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.

Updated : 20 Feb 2021 05:52 IST

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం పెరగడంతో పాటు దాదాపు ఈ రంగంలో 90శాతం వృద్ధి కనిపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ రంగంలో భారీ పెట్టుబడులు రావడంతో పాటు ఎగుమతులు కూడా భారీగా పెరిగినట్లు చెప్పారు. పతంజలి సంస్థ తయారు చేసిన కొవిడ్‌ మందును ధ్రువీకరించే పరిశోధనా పత్రాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేశారు.

‘అధికారిక లెక్కల ప్రకారం రూ.30వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఆయుర్వేద రంగం, 15 నుంచి 20శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. అయితే, ఇవి కొవిడ్‌కు ముందున్న లెక్కలు. కానీ, కొవిడ్‌ తర్వాత ఆయుర్వేద రంగం 50 నుంచి 90శాతం వృద్ధి చెందింది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టంచేశారు. ఆయుర్వేద విభాగంలో కేవలం ఎగుమతులే కాకుండా, విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఆయుర్వేదకు ఆమోదం తెలుపుతున్నాయనే విషయం వీటివల్ల స్పష్టమవుతోందని హర్షవర్ధన్ పేర్నొన్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ 140 ప్రాంతాల్లో 109 రకాల అధ్యయనాలను ఆయుష్‌ మంత్రిత్వశాఖ చేపట్టిందని.. వాటి ఫలితాలు ఆశాజనకంగా కనిపించాయని తెలిపారు.

ఆయుర్వేదతోనే ఎక్కువ ప్రయోజనం

ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆయుర్వేద ఔషధాలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. తాను స్వయంగా ఆధునిక వైద్యశాస్త్రం(ENT విభాగం)లో ప్రాక్టీస్‌ చేసినప్పటికీ, ఆయుర్వేదను చదివానని చెప్పారు. తద్వారా ఆయుర్వేదం అందరికీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ, ఆధునిక పద్ధతిలో ఆయుర్వేదం మరోసారి పునః వైభవాన్ని సంపాదించాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద విశ్వవ్యాప్తంగా చేయడంలో  బాబా రాందేవ్‌, పతంజలి బృందం చేస్తోన్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్‌తో పాటు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు.

ఇదిలాఉంటే, కరోనాకు ఆయుర్వేద ఔషధాన్ని తీసుకువచ్చినట్లు కొన్ని నెలల క్రితం పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటించింది. ‘కరోనిల్‌’ పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చామని..ఇది 14 రోజుల్లోపే కరోనా నియంత్రించే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే, ఎటువంటి పరిశోధనా, ఆధారాలు లేకుండా కొవిడ్‌ ఔషధాన్ని పతంజలి తీసుకువచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని తాజాగా కేంద్ర మంత్రి సమక్షంలో పతంజలి విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని