Updated : 05 Jul 2022 07:20 IST

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులపై ‘పైకా’ళింగ కన్నెర్ర!

 

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనగానే అంతా 1857 ఉత్తరాదిన మొదలైన సిపాయిల తిరుగుబాటు అంటాం. ఒడిశావాసులు మాత్రం అందుకు అంగీకరించరు. కారణం- అంతకంటే 40 ఏళ్ల ముందే... 1817లోనే ఆంగ్లేయులపై అనూహ్య దాడికి వారి రాష్ట్రం వేదికైంది.  అదే పైకా తిరుగుబాటు. తెల్లవారిని తెల్లబోయేలా చేసిన ఈ పైకా విప్లవాన్ని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పిలవాలన్నది నేటికీ  ఒడిశా ప్రభుత్వ, ప్రజల డిమాండ్‌!

పైకాలంటే సైనిక రైతులు! కళింగ రాజ్య కాలం నుంచీ ఇక్కడ పైకాల సంప్రదాయం వేళ్లూనుకుంది. యుద్ధ సమయంలో పైకాలు రాజు తరఫున రంగంలోకి దిగేవారు. సాధారణ సమయాల్లో తమకు కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేసేవారు, చేయించేవారు. పైకాల్లో వారువీరని కాకుండా అన్ని కులాల వారుండేవారు. అన్ని ఊర్లలో వీరే శాంతిభద్రతలను కాపాడే బాధ్యత కూడా తీసుకునేవారు. పూరీకి సమీపంలోని ఖుర్దా రాజ్యంలోనూ వీరి సంఖ్య భారీగా ఉండేది. ప్రతిష్ఠాత్మక పూరి జగన్నాథ దేవాలయ నిర్వహణ బాధ్యత ఈ ఖుర్దా రాజుదే. అందుకే ఒడిశాలో ఖుర్దాకు ఎంతో ప్రత్యేకత ఉండేది. మరాఠాలను ఓడించి ఒడిశాను విడతలు విడతలుగా (1803-04 నాటికి) స్వాధీనం చేసుకున్న బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ తొలుత తమ రాకపోకలకు వీలుగా ఖుర్దా రాజు రాజా ముకుందదేవ-2తో నోటిమాట ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వెనకాలున్న ఆక్రమణ కుట్రను పసిగట్టిన ప్రధాని రాజగురు తమ రాజును అప్రమత్తం చేశారు. కానీ అప్పటికే 1804 డిసెంబరులో ఆంగ్లేయ సైన్యం ఖుర్దాపై దాడి చేసింది. రాజు తరఫున పైకాలు రంగంలోకి దిగినా లాభం లేకపోయింది. రాజు ముకుందదేవ సమీప అడవుల్లోకి వెళ్లి తలదాచుకోగా, ప్రధాని రాజగురును అదుపులోకి తీసుకున్న ఆంగ్లేయులు అత్యంత దారుణంగా హతమార్చారు. మర్రిచెట్టుకు తలకిందులుగా వేలాడదీసి... శరీరాన్ని రెండుగా చీల్చి చంపారు. తర్వాత రాజు ముకుందదేవను పట్టుకొని కేవలం పూరీకే పరిమితం చేసి డమ్మీగా ఉంచారు.

మరోవైపు...పైకాలపై కంపెనీ అధికారులకు సదభిప్రాయం లేదు. ఏనాటికైనా వారు జన్మభూమికే విశ్వాసంగా ఉంటారని భావించి... వారి నుంచి భూమిని లాక్కొని బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన భూస్వాములకు అప్పగించారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా శిస్తు పెంచారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు కూడా వేరే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ పైకాలను పీల్చిపిప్పి చేశాయి.

అప్పటిదాకా రాజ్య సంరక్షకులుగా భూమిపై హక్కులనుభవిస్తున్న వారు కాస్తా... ఉన్నట్టుండి బికారులయ్యారు. తలవంచుకొని బతకటమో... తిరుగుబాటు చేయటమో...  తేల్చుకోవాల్సిన తరుణంలో పైకాలు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు.
బక్షి జగబంధు విద్యాధర్‌ మహాపాత్ర భ్రమరబర్‌ రే సారథ్యంలో తిరుగుబాటుకు తెరలేచింది. బక్షి జగబంధు... ఖుర్దా రాజ్య సర్వసైన్యాధిపతి. ఆంగ్లేయుల స్వాధీనం తర్వాత... నిరుపేదగా మారి స్థానికుల విరాళాల మీద బతకాల్సిన దైన్యస్థితి ఏర్పడింది. తన ఆస్తుల గురించి అడిగితే కోర్టుకెళ్లమనేవారు. ఆంగ్లేయ న్యాయస్థానంలో ఏం జరుగుతుందో ఊహించిన బక్షి జగబంధు సాయుధ పోరాటానికే సిద్ధమయ్యారు. 1817 మార్చిలో 500 మందికిపైగా పైకాలు... ఖుర్దా జిల్లాలోని బాన్‌పుర్‌ వద్ద తిరుగుబాటు ఆరంభించారు. ప్రభుత్వ భవనాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ వెళ్లారు. వీరి దాడికి భయపడి అక్కడి బ్రిటిష్‌ మేజిస్ట్రేట్‌ కటక్‌కు పారిపోయాడు. ఖుర్దా తిరుగుబాటును వర్ణిస్తూ ఇది పూరీదిశగా సాగుతోందని... తొందరగా బలగాలను దించాలని కలకత్తాకు సందేశం పంపించాడు. ఈ సందేశం చేరేలోపే... పైకాలు పూరీ చేరుకున్నారు. జగన్నాథ ఆలయ పూజారులు సైతం పైకాలకు మద్దతు ప్రకటించారు. కంపెనీ పాలనపై యుద్ధం ప్రకటించారు. పైకాల దాడిని తట్టుకోలేక పూరీలోని ఆంగ్లేయ అధికారులు, బలగాలు కటక్‌కు తోకముడిచాయి.

ఒడిశా చేజారుతుందని భావించిన ఈస్టిండియా కంపెనీ భారీబలగాలను పూరీకి తరలించింది. ఆంగ్లేయుల ఆధునిక ఆయుధాల ముందు పైకాలు తేలిపోక తప్పలేదు. అప్పటికీ పట్టుదలతో నెల రోజుల భీకర పోరు సాగించారు. వేలమంది పైకాలను పట్టుకొని దారుణంగా శిక్షించింది కంపెనీ. తమకు వ్యతిరేకంగా పైకాలతో చేతులు కలిపినందుకు సుమారు 50 మంది పూరీ దేవాలయ పూజారులనూ ఉరితీసింది. వందలమంది పైకాలు అడవుల్లోకి పారిపోయి... చాలాకాలం పాటు గెరిల్లా తరహాలో దాడులు చేస్తూనే ఉన్నారు. బక్షి జగబంధును 1825 నుంచి కటక్‌ జైలులో ఉంచారు. నాలుగేళ్ల తర్వాత అక్కడే కన్నుమూశారాయన. బలమైన ఈ తిరుగుబాటుతో కంగుతిన్న ఈస్టిండియా కంపెనీ... కారణాలు వెదకాలంటూ వాల్టర్‌ ఎవర్‌ సారథ్యంలో ఓ విచారణ సంఘాన్ని నియమించింది. ఆంగ్లేయుల దమననీతి, దారుణమైన పాలన పద్ధతులే పైకాల తిరుగుబాటుకు కారణమని కమిషన్‌ తేల్చటం గమనార్హం. అయినా... కంపెనీ తన తీరు మార్చుకోలేదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts