Kolkata: 19మంది చిన్నారులు మృతి.. బెంగాల్‌లో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

చిన్న పిల్లల మరణాలు పెరుగుతుండటంతో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 07 Mar 2023 18:49 IST

కోల్‌కతా: శ్వాస సంబంధిత సమస్యలతో చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్‌(West bengal) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల తరుణంలో సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని.. ఫీవర్‌ క్లినిక్‌లు నిరంతరం (24*7)  పనిచేయాలని ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు, ఇదే అంశంపై సీఎం మమతా బెనర్జీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌(ARI)మూలంగా ఇప్పటివరకు 19మంది చిన్నారులు మృతిచెందారని.. వీరిలో ఆరుగురు ఎడినో వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు మళ్లీ మాస్కులు ధరించడం ప్రారంభించాలని దీదీ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, గత రెండు నెలలుగా కోల్‌కతాలోని చిన్నారుల్లో దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల లోపు చిన్నారుల్లో అయితే తీవ్రమైన గురకతో ఇబ్బంది పడుతున్న కేసులూ నమోదయ్యాయి. వీరిలో కొందరినీ వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందించాల్సి వచ్చినట్టు ఇటీవల అధికారులు తెలిపారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌ బారిన పడి ఇప్పటివరకు 19మంది చిన్నారులు మృతిచెందారు. ఇదిలా ఉం డగా.. జనవరి నెలలోని మూడు  వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటరిక్‌ డిసీజెస్‌కు పంపగా.. 33శాతం నమూనాల్లో అడినో వైరస్‌ను గుర్తించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని