Sushil Kumar Modi: మీడియా సంస్థలతో టెక్‌ దిగ్గజాలు ‘యాడ్‌ రెవెన్యూ’ పంచుకోవాలి..!

టెక్‌ దిగ్గజ సంస్థలు పొందే యాడ్‌ రెవెన్యూను (Ad Revenue) మీడియా సంస్థలతోనూ పంచుకోవాల్సిన అవసరం ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ పేర్కొన్నారు. సాంకేతిక దిగ్గజ సంస్థలు (Google, Facebook) వచ్చిన తర్వాత వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోయినట్లు వెల్లడించారు.

Published : 10 Feb 2023 23:58 IST

దిల్లీ: గూగుల్‌ (Google), ఫేస్‌బుక్‌ (Meta) వంటి టెక్‌ దిగ్గజ సంస్థలు ప్రకటనల ద్వారా భారీ ఆదాయాన్ని (Ad Revenue) సముపార్జిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాంకేతిక దిగ్గజ కంపెనీలు పొందుతున్న ప్రకటనల ఆదాయాన్ని మీడియా సంస్థలతో పంచుకోవాలని భాజపా రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ (Sushil Kumar Modi) సూచించారు. న్యూస్‌ కంటెంట్‌ను వాస్తవంగా క్రియేట్‌ (Content Creation) చేసేవి ఈ మీడియా సంస్థలేనని.. ఈ వార్తా నివేదికలనే పోస్టు చేస్తూ టెక్‌ దిగ్గజాలు ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.

‘వార్తల కంటెంటును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు వేల కోట్ల రూపాయలను ఖర్చుపెడతాయి. అటువంటి సంస్థలు కేవలం ప్రకటనల ద్వారానే ఆదాయం పొందుతాయి. కానీ, ఈ భారీ టెక్‌ కంపెనీలు ప్రవేశించిన తర్వాతే వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లు యాడ్‌ రెవెన్యూను కోల్పోతున్నాయి. 2021-22లో గూగుల్‌ ఇండియా ఆదాయం రూ.24,927 కోట్లు కాగా ఫేస్‌బుక్‌ రూ.16,189 కోట్లు ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ప్రకటనల ఆదాయం 75శాతం వృద్ధి కనిపించింది’ అని రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ పేర్కొన్నారు.

ఇలా ప్రకటనల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతోన్న టెక్‌ కంపెనీలు కంటెంట్‌ క్రియేషన్‌ కోసం పైసా ఖర్చు పెట్టవని.. సిద్ధంగా ఉన్న కంటెంట్‌నే ఉచితంగా చూపిస్తాయని సుశీల్‌ కుమార్‌ మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవంగా కంటెంట్‌ క్రియేట్‌ చేసే సంస్థలతో ప్రకటనల ఆదాయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపాదిత డిజిటల్‌ ఇండియా యాక్ట్‌ (Digital India Act)లో ఇందుకు సంబంధించిన నిబంధన రూపొందించాలని.. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే దీనిపై చట్టాన్ని కూడా చేసిన విషయాన్ని సుశీల్‌ మోదీ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని