బర్డ్‌ ఫ్లూ: మానవులకు సంక్రమిస్తుందా..?

పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ బర్డ్‌ ఫ్లూ, కొన్ని సందర్భాల్లో మానవులకు సోకే ప్రమాదముందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Updated : 07 Jan 2021 05:01 IST

దిల్లీ: కరోనా నుంచి కోలుకుంటోన్న భారత్‌కు తాజాగా మరోరూపంలో వచ్చిన బర్డ్ ఫ్లూ కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో ఫ్లూ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే, పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ బర్డ్‌ ఫ్లూ, కొన్ని సందర్భాల్లో మానవులకు సోకే ప్రమాదముందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఏమిటీ బర్డ్ ఫ్లూ..?
ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా(ఏఐ)కు చెందిన టైప్‌-ఏ వైరస్‌ మనదేశంలో బర్డ్‌ ఫ్లూగా ప్రాచుర్యం పొందింది. ఇక పందుల నుంచి మానవులకు సంక్రమించే H3N2, H1N1 వంటివైరస్‌లు కూడా ఈ రకానికి చెందినవే. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో డజనుకుపైగా వైరస్‌లు ఉండగా హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కొన్ని కోళ్లు, పక్షుల్లో గుడ్లు తక్కువగా పెట్టడం వంటి స్వల్ప తీవ్రత చూపించగా, మరికొన్ని మాత్రం వాటి ప్రాణ నష్టానికి దారితీస్తాయి. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ హెచ్5ఎన్1 రకాన్ని తొలిసారిగా 1997లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

మానవులకు సంక్రమిస్తుందా..?
మన దేశంలో ఉండే అనువైన వాతారణం దృష్ట్యా ప్రతిఏటా విదేశీ పక్షులు భారత్‌కు వలస వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో(సెప్టెంబర్‌, అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు)
 భారత్‌లోకి వచ్చే వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుంది.ఈ సమయంలో కొన్ని నిర్వహణ పద్ధతుల వల్ల వీటివల్ల ఇతర పక్షులకు, జంతువులతో పాటు మానవులకు వైరస్‌ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైరస్‌ సోకిన పక్షులను నేరుగా ముట్టుకోవడం, అవి ఉన్న పరిసరాలు, వైరస్‌ సోకిన పక్షుల ఉడికించని మాంసం తినడం ద్వారా మానవులకు సోకే ప్రమాదముందని సూచిస్తున్నారు. అయితే, అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వైరస్‌ బ్రతకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టంచేసింది. అందుకే ఉడికించిన మాంసం ద్వారా వైరస్‌ సోకే ఆస్కారం ఉండదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాకుండా వ్యక్తుల నుంచి వ్యక్తులకు సోకే ప్రమాదం కూడా లేదని తెలిపింది. ఒకేవేళ మానవులకు వైరస్‌ సోకితే సాధారణ ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

భారత్‌లో ఎప్పుడు గుర్తించారంటే..!
భారత్‌లో మాత్రం బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని తొలిసారిగా 2006లో గుర్తించారు. అయితే, ఇది పక్షులు, జంతువులకు వ్యాపించినప్పటికీ వాటి నుంచి మానవులకు సంక్రమించిన దాఖలాలు మనదేశం‌లో లేవని కేంద్ర పాడి పశుసంవర్థక మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేకాకుండా కలుషిత పౌల్ట్రీ ఉత్పత్తుల వల్ల ఈ వైరస్‌లు మానవులకు వ్యాప్తి చెందుతాయని చెప్పడానికీ ప్రత్యక్ష ఆధారాలు కూడా లేవని స్పష్టంచేసింది. అయితే, వ్యక్తిగత పరిశుభ్రత, క్రిమిసంహారక పద్దతులు, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం, పచ్చి గుడ్లను తినకుండా ఉండటం ద్వారా ఈ వైరస్‌లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని సూచించింది. ముఖ్యంగా సక్రమంగా ఉడికించిన మాంసాన్నే తీసుకోవాలని తెలియజేసింది.

జాగ్రత్తలతో కట్టడి..
దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ‌ కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఏవియన్ ఇన్ ఫ్లుయంజా(బర్డ్‌ ఫ్లూ) నియంత్రణ కోసం కొన్నినెలల ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. పౌల్ట్రీ కేంద్రాల్లో రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రభావిత ప్రాంతాలను క్రిమిసంహారం చేయడం, చనిపోయిన పక్షుల మృతదేహాలను సక్రమంగా పారవేయడం, వాటి నమూనాలను సకాలంలో సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయడం వంటి చర్యలపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది. పక్షులకు ప్రాణాంతకమైన ఈ వైరస్‌ గత దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిలో మార్పులు చేస్తూ ప్రతిఏటా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది.

ఇవీ చదవండి..
బర్డ్ ఫ్లూ: రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌
4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని