Sameer Wankhede: ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారుక్‌ వేడుకున్నారు: సమీర్‌ వాంఖడే

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan)ను జైల్లో పెట్టొద్దని నటుడు షారుక్‌ ఖాన్‌ తనను వేడుకున్నారని సమీర్‌ వాంఖడే (Sameer Wankhede) సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ అరెస్టుకు ప్రతీకారంగానే తనపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు.

Published : 20 May 2023 01:45 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan)ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే (Sameer Wankhede) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలతో తనపై నమోదైన సీబీఐ కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌లో సమీర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ను జైల్లో పెట్టొద్దని షారుక్‌ తనను వేడుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) చేసినట్లుగా చెబుతున్న ఓ వాట్సప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్లను సమీర్‌ వాంఖడే (Sameer Wankhede) హైకోర్టుకు సమర్పించారు. ‘‘ఈ కేసులో కాస్త నిదానంగా వ్యవహరించండి. విచారణకు అన్ని వేళలా సహకరిస్తానని మాటిస్తున్నా. నేనేంటో మీకూ తెలుసు కదా. దయచేసి మా కుటుంబంపై కనికరం చూపండి. ఓ కరుడుగట్టిన నేరస్థుడిలా నా కుమారుడిని జైల్లో పెట్టకండి ప్లీజ్‌. అది అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఏం చెప్పినా చేస్తా. ఓ తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నా’’ అని షారుక్‌ తనకు వాట్సప్‌లో మెసేజ్‌లు చేశారని సమీర్‌ వాంఖడే ఆరోపించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ అరెస్టు చేసినందుకు ప్రతీకారంగానే తనపై సీబీఐ కేసు నమోదు చేసిందని వాంఖడే ఆరోపించారు. అంతేగాక, ముంబయి జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనపై అధికారులు తనను కులం పేరుతో అవమానించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలోనూ తనపై అవినీతి ఆరోపణలు వచ్చినా.. అవి రుజువు కాలేదన్నారు.

వాంఖడేపై చర్యలొద్దు: బాంబే హైకోర్టు

ఈ పిటిషన్‌పై వాదనలు విన్న బాంబే హైకోర్టు.. సమీర్‌ వాంఖడేకు స్వల్ప ఊరట కల్పించింది. లంచం కేసులో ఆయనపై మే 22 (సోమవారం) వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఈ కేసులో వాంఖడేకు సీబీఐ నిన్న సమన్లు జారీ చేయగా.. ఆయన హాజరుకాలేదు.

వాంఖడే జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2021 అక్టోబరులో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించిన కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు వాంఖడేతోపాటు మరో నలుగురు రూ.25కోట్లు లంచం డిమాండ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం అడ్వాన్సుగా రూ.50లక్షలు స్వీకరించినట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. వాంఖడే సహా మరికొందరిపై కేసు నమోదు చేసింది.

మరోవైపు ఈ ఆరోపణలపై ఎన్‌సీబీ కూడా విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వాంఖడేకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముంబయిలో ఆయనకు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని తెలిసింది. అంతేగాక, వాంఖడే ఐదేళ్లలో ఆరుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా.. అందుకు సంబంధించిన ఖర్చులను తప్పుగా వెల్లడించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక, డ్రగ్స్‌ పార్టీ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎన్‌సీబీ ఆ తర్వాత క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని