yediyurappa: యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప మనవరాలు సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.  బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో

Published : 29 Jan 2022 02:17 IST

ఈనాడు డిజిటల్ బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప మనవరాలు సౌందర్య(30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని వసంతనగర్‌లో గల తమ అపార్ట్‌మెంట్‌లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. యడియూరప్ప ద్వితీయ కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య. ఈమెకు 2018లో నీరజ్‌తో వివాహమైంది. సౌందర్య దంపతులిద్దరూ స్థానిక ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. 

శుక్రవారం ఉదయం సౌందర్య భర్త నీరజ్ విధులకు వెళ్లారు. ఆ సమయంలో పనిమనిషి, 9 నెలల కుమారుడితో సౌందర్య ఇంట్లోనే ఉన్నారు. భర్త బయటకు వెళ్లిపోయిన తర్వాత తన గదికి వెళ్లిన సౌందర్య తలుపు వేసుకుంది. అల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి డోర్‌ కొట్టగా.. ఎంతకూ తలుపు తీయకపోవటంతో ఆమె నీరజ్ కు ఫోన్ చేసింది. 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నీరజ్ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సౌందర్య ఉరికి వేలాడుతూ కన్పించింది. వెంటనే దగ్గర్లోని మల్లిగే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య మృతదేహాన్ని బెంగళూరు ఉత్తర అబ్బిగెరె నీరజ్ ఫామ్‌ హౌజ్‌కు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ కారణమా..?

9 నెలల కుమారుడున్న సౌందర్య పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భార్యభర్తల మధ్య గొడవలేమీ లేవని సమాచారం. వారి మధ్య గొడవలు ఉంటే యడియూరప్ప కుటుంబ సభ్యులు నేరుగా నీరజ్ ఇంటికి వెళ్లి ఆయన నివాసం వద్దనే మృతదేహాన్ని ఉంచే అవకాశం లేదని బంధువర్గాలు చెబుతున్నాయి. సౌందర్య పోస్టుమార్టం ప్రక్రియ ముగ్గురు వైద్యుల సమక్షంలో సీసీ కెమెరాల నడుమ చేపట్టినట్లు డాక్టర్‌ సతీష్ వెల్లడించారు. గొంతు భాగంలో గాటు తప్ప శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. గదిలో సూసైడ్ నోటు కూడా లేకపోవటంతో ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని