Partha Chatterjee: ఆ డబ్బంతా మంత్రిదే.. ఈడీకి వెల్లడించిన అర్పిత!

ఇంట్లో రూ.20కోట్ల నగదుతో పట్టుబడ్డ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఆ డబ్బంతా మంత్రిదే అని అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.........

Published : 25 Jul 2022 21:43 IST

దిల్లీ: ఇంట్లో రూ.20కోట్ల నగదుతో పట్టుబడ్డ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఆ డబ్బంతా మంత్రిదే అని అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. తన ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకొని విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులకు అర్పిత వాగ్మూలం ఇచ్చింది. కాగా తన ఇంట్లో లభించిన ఆ డబ్బంతా మంత్రి ఛటర్జీదేనని అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఒప్పుకొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ డబ్బంతా ఒకటి, రెండు రోజుల్లో వేరే ప్రాంతానికి తరలించాలని ప్రణాళిక వేసుకుంటున్న సమయంలోనే దొరికిపోయినట్లు అర్పిత వెల్లడించినట్లు పేర్కొన్నాయి.

బెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈడీ అధికారులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కాగా, అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని భావిస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈనేపథ్యంలో అర్పితతోపాటు మంత్రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని