Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం.. కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదివారం విచారణకు రావాలని పేర్కొంది.

Updated : 14 Apr 2023 18:39 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణలో భాగంగా.. దిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వారి రిమాండ్‌ రిపోర్టులో కేజ్రీవాల్‌ పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను కూడా సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.

దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖరాయడంతో సీబీఐ కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా సిసోదియా పేరును చేర్చింది.  సమాంతరంగా ఇదే కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటి వరకు సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్‌, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, అభిషేక్‌ బోయిన్‌పల్లి, అమిత్‌ అరోడా, మాగుంట రాఘవరెడ్డిలను అరెస్ట్‌ చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవల ఈడీ విచారించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు