జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా సిద్ధమే: సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కొద్దిరోజులుగా సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది.

Updated : 31 Aug 2023 13:07 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం గురువారం బదులిచ్చింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి అవసరమైన నియామవళిని రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. 

ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కొద్దిరోజులుగా సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం, స్టేట్ పోల్ ప్యానెల్ నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. అలాగే మూడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మొదటి రెండు దశల్లో పంచాయతీ, మున్సిపల్‌ పోల్స్‌ ఉంటాయని, ఆ తర్వాత అసెంబ్లీ స్థాయి ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. 

రెండురోజుల క్రితం పిటిషనర్ల వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకమన్న ధర్మాసనం.. దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది. అందుకు మెహతా బదులిస్తూ..‘జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు. లద్దాఖ్‌కు సంబంధించినంత వరకు యూటీ హోదా మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు