Vaccination: సిరంజీల ఎగుమతులపై పరిమితులు.. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసేందుకే!

దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి మూడు నెలలపాటు మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఈ విషయమై...

Published : 09 Oct 2021 14:30 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి మూడు నెలలపాటు మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ‘అంత్యోదయ’ ఆశయ సాధనలో భాగంగా, దేశంలో అర్హులందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామన్న హామీ నెరవేర్చే క్రమంలో.. దేశంలో సిరంజీల లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ సమయంలో టీకా ప్రక్రియ పూర్తి చేయడానికి, ఈ కార్యక్రమ వేగాన్ని కొనసాగించడానికి సిరంజీల లభ్యత చాలా అవసరం’ అని పేర్కొంది. 0.5 ఎంఎల్‌/1 ఎంఎల్‌ ఆటో డిసేబుల్‌, 0.5 ఎంఎల్‌/1 ఎంఎల్‌/ 2 ఎంఎల్‌/ 3 ఎంఎల్‌ డిస్పోజబుల్‌, 1 ఎంఎల్‌/2 ఎంఎల్‌/3 ఎంఎల్‌ రీ యూజ్‌ ప్రివెన్షన్‌ సిరంజీలపై ఈ పరిమితులు కొనసాగుతాయని చెప్పింది. ఇతర సిరంజీలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.

మరోవైపు శనివారం మధ్యాహ్నం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 94 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఇందులో 67.80 కోట్లకుపైగా ఫస్ట్‌ డోసులు కాగ, 26.26 కోట్ల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. దసరా(అక్టోబరు 15)లోపే వంద కోట్ల మార్క్‌ను అందుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని