Chhattisgarh: లాక్‌డౌన్‌ వేళ.. ఇంటికే లిక్కర్‌!

మద్యం అమ్మకాలను మాత్రం నేరుగా ఇంటికే (హోం డెలివరీ) చేరవేస్తామని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Published : 10 May 2021 01:04 IST

హోం డెలివరీకి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ నిర్ణయం

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధిస్తున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కొన్ని అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను పూర్తిగా మూసివేసింది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను మాత్రం నేరుగా ఇంటికే (హోం డెలివరీ) చేరవేస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి లిక్కర్‌ సేవలను అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటనపై భాజపా మండిపడుతోంది.

లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న వేళ మద్యం దుకాణాలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందకు వేసింది. లిక్కర్‌ను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే వారికి నేరుగా హోం డెలివరీ చేయవచ్చని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది. ఉదయం 9 నుంచి రాత్రి 8గంటల వరకు హోం డెలివరీ చేసుకోవచ్చని పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా వంటిని కట్టడి చేసేందుకు లిక్కర్‌ హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారి పేర్కొన్నారు.

లిక్కర్‌ హోం డెలివరీ బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌(CSMCL) చేపట్టింది. CSMCL వెబ్‌సైట్‌లో ముందస్తు చెల్లింపు ద్వారా హోం డెలివరీ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ఒక్కో కస్టమర్‌కు గరిష్ఠంగా ఐదు లీటర్ల మద్యాన్ని సరఫరా చేస్తామని వెల్లడించింది. ఇదివరకు లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనూ మద్యాన్ని హోం డెలివరీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని