మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌’ (సీఆర్‌ఎస్‌) ఆరోపించింది.

Published : 26 Apr 2024 03:56 IST

అమెరికా స్వతంత్ర సంస్థ సీఆర్‌ఎస్‌ నివేదిక

వాషింగ్టన్‌, దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌’ (సీఆర్‌ఎస్‌) ఆరోపించింది. 2019లో మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది మరింత పెరిగిందని ఒక నివేదిక వెలువరించింది. ‘బైడెన్‌ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 10.3 కోట్ల డాలర్ల సాయం అందించాలని భావిస్తోంది. వీటిలో కొంత మొత్తాన్నైనా.. భారత్‌లో పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను మెరుగుపరచడంతో ముడిపెట్టే అవకాశాన్ని చట్టసభలు పరిశీలించాలి’ అని దీనిలో సూచించింది. 2023లో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా విదేశాంగ శాఖ నివేదిక రూపొందించిన నేపథ్యంలో సీఆర్‌ఎస్‌ నివేదిక విడుదలైంది. హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో ఉంటోందని, కొన్నింటిలో ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉందని ఆ నివేదిక తెలిపింది.

మూడు భారతీయ కంపెనీలపై ఆంక్షలు

ఇరాన్‌ సైన్యానికి సాంకేతికత బదలాయింపు, అక్రమ వాణిజ్యం ఆరోపణలపై 12కు పైగా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో భారత్‌కు చెందినవి మూడు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్లు సరఫరా చేయడంలో ఈ కంపెనీల పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది.

పక్షపాతంతో కూడుకుంది : భారత్‌

హక్కులపై నివేదిక పూర్తి పక్షపాతంతో కూడుకున్నదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ దిల్లీలో తెలిపారు. ‘‘ఆ నివేదిక పూర్తిగా పక్షపాతంతో కూడుకుంది. భారత్‌ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీంతో అర్థమవుతోంది. దీనికి మేం ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. మీరు కూడా ఇవ్వొద్దు’’ అని విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని