Joe Biden: నమ్మకంగా చెబుతున్నా.. తాలిబన్లతో ఒప్పందం చేసుకోవడానికి చైనా యత్నం

తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో

Updated : 08 Sep 2021 12:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని తాను నమ్మకంగా చెప్పగలనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న తాలిబన్లకు చైనా నుంచి నిధులు వెళ్లడంపై అమెరికా ఆందోళనగా ఉందా..? అని విలేకర్లు బైడెన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ..‘‘చైనాకు నిజమైన సమస్యలు తాలిబన్లతోనే వస్తాయి. అందుకనే వారు తాలిబన్లతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తారు. పాకిస్థాన్‌, రష్యా, ఇరాన్‌లు కూడా ఇలానే చేస్తాయని నమ్ముతున్నాను. వారందరు ఇప్పుడేం చేయగలరో అదే  చేస్తారు’’ అని సమాధానం ఇచ్చారు.

ఇప్పటికే అమెరికా, దాని ఏడు మిత్రదేశాలు సమన్వయంగా వ్యహరించే విషయంపై ఓ అంగీకారానికి వచ్చాయి. అఫ్గాన్‌ విదేశీ మారకద్రవ్య రిజర్వును తాలిబన్లు వినియోగించుకోకుండా అమెరికా బ్లాక్‌ చేసింది. తొలుత అఫ్గాన్‌ మహిళలు, ఇతర అంశాల్లో తాలిబన్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతోంది. కానీ, ఇప్పుడు చైనా, రష్యా వంటి దేశాలు తాలిబన్లతో ఒప్పందం చేసుకొంటే..  తాలిబన్లు అమెరికాలోని రిజర్వు నిధి కోసం పెద్దగా వెంపర్లాడరని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మిగిలిన దేశాలను కూడా సమన్వయం చేసుకోవడానికి వీలుగా ఇటలీ నేతృత్వంలో వర్చువల్‌గా జీ20 సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో చైనా, రష్యాకు కూడా సభ్యత్వం ఉంది. ఇప్పటివరకు తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదు. మరోపక్క ఆగస్టు 29వ తేదీన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకన్‌కు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు తాలిబన్లతో చర్చించి వారికి సానుకూల మార్గదర్శకత్వం చేయాలని సూచించారు.  చైనా ఇప్పటి వరకు అఫ్గాన్‌లో తాలిబన్‌ పాలనను గుర్తించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని