Bihar Political Crisis: నీతీశ్‌ ఊసరవెల్లితో పోటీ పడుతున్నారు.. కాంగ్రెస్‌ ఎద్దేవా

Bihar Political Crisis: బిహార్‌ సీఎంగా రాజీనామా చేసిన నీతీశ్‌ కుమార్‌పై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారని తమకు ముందే తెలుసని పేర్కొంది.

Updated : 28 Jan 2024 15:03 IST

పట్నా: తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar).. రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్‌ (Congress) ఎద్దేవా చేసింది. బిహార్ ప్రజల అభీష్టాన్ని ఆయన విస్మరిస్తున్నారని.. దీన్ని వారు ఎట్టిపరిస్థితుల్లో క్షమించబోరని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను చూసి ప్రధానమంత్రి మోదీతో పాటు ఆయన పార్టీ భాజపా భయపడుతోందన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెరతీశారని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి గుడ్‌బై చెప్పిన నీతీశ్‌ (Nitish Kumar) సీఎంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ మండిపడింది.

నీతీశ్‌ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని తాము ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నీతీశ్‌ లాంటి ‘ఆయా రామ్‌.. గయా రామ్‌’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని ఎద్దేవా చేశారు.

ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి నుంచి జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ వైదొలిగారు. భాజపా మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యేలు నీతీశ్‌కు తమ మద్దతును తెలియజేస్తూ లేఖలిచ్చారు. బిహార్‌లో ఎన్‌డీయే సర్కార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భాజపా శాసనసభాపక్షం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని