Gambia: ఆ సిరప్‌లను భారత్‌లో విక్రయించలేదు: కేంద్రం

ఆఫ్రికా దేశమైన గాంబియా లో 66 మంది చిన్నారుల మృతికి కారణమైనట్లుగా భావిస్తున్న దగ్గు, జలుబు సిరప్‌లను భారత్‌లో విక్రయించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఔషధాలన్ని కేవలం ఇతర దేశాలకు ఎగుమతి చేయాడానికే తయారు చేశారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Published : 07 Oct 2022 00:12 IST

దిల్లీ: ఆఫ్రికా దేశమైన గాంబియా లో దగ్గు, జలుబు సిరప్‌ల వినియోగంతో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన మైడెన్‌ అనే  ఫార్మాస్యూటికల్‌  సంస్థ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఆందోళన మొదలైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.  సిరప్‌ నమూనాలను పరీక్షల కోసం ఇప్పటికే ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఔషధాలన్ని కేవలం ఇతర దేశాలకు ఎగుమతి చేయాడానికే తయారు చేశారని, భారత్‌లో వీటిని విక్రయించలేదని వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో నుంచి వచ్చిన నమూనాలను పరీక్షించిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

హరియాణాకు చెందిన మైడెన్‌ సంస్థ 1990లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. హరియాణాలోని కుండ్లీ, పానిపట్‌లలో రెండు తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. ఇటీవలే మరొకటి ఏర్పాటు చేశారు. తాజా ఘటనపై హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. పూర్తిస్థాయి పరీక్షల కోసం సంబంధిత సిరప్‌ల శాంపిళ్లను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లేబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఏదైనా తప్పు జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని