Covaxin: 6-12ఏళ్ల చిన్నారులపై ప్రయోగాలు..!

 పిల్లల్లో కొవాగ్జిన్‌ ప్రయోగాల్లో భాగంగా, 6నుంచి 12ఏళ్ల చిన్నారులపై మంగళవారం నుంచి ట్రయల్స్‌ జరిపేందుకు దిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు చేశారు.

Updated : 15 Jun 2021 11:25 IST

దిల్లీ ఎయిమ్స్‌లో మంగళవారం నుంచి వాలంటీర్ల నియామకం

దిల్లీ: భారత్‌లో చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఊపందుకున్నాయి. పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 12 నుంచి 18ఏళ్ల వారిపై ప్రయోగాలు పూర్తికాగా.. తాజాగా 6నుంచి 12ఏళ్ల చిన్నారులపై మంగళవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు దిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు చేశారు.

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా 6నుంచి 12ఏళ్ల వయసు కలిగిన వాలంటీర్ల కోసం మంగళవారం నుంచి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎయిమ్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవి పూర్తైన తర్వాత రెండు నుంచి ఆరేళ్లలోపు పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలను ప్రారంభిస్తారు. కొవాగ్జిన్‌ తీసుకున్న తర్వాత పిల్లల్లో వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని నిపుణులు అంచనా వేయనున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్‌ భద్రత, దుష్ర్పభావాలు, రోగనిరోధకత ప్రతిస్పందనలను నిపుణులు అంచనా వేస్తారు.

కరోనాను ఎదుర్కొనేందుకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను రూపొందించింది. వీటికి సంబంధించిన రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా పిల్లలపై మూడు విభాగాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాలను మొత్తం 525 మంది చిన్నారులపై చేపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని