Covishield: గడువుకన్నా ముందే సెకండ్‌ డోసు.. ఎవరికంటే..?

వ్యవధికన్నా ముందే కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకోవాలనుకునే వారికోసం కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

Published : 15 Jun 2021 21:25 IST

క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 12 వారాలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందే రెండో డోసు తీసుకోవాలనుకునే వారికోసం కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా ఉద్యోగం, ఉన్నత చదువులు, క్రీడల కోసం విదేశాలకు వెళ్లే వారికి నిర్ధేశించిన 84రోజుల గడువుకంటే ముందే రెండో డోసును తీసుకోవచ్చని తెలిపింది. అయితే, తొలి డోసు తీసుకున్న 28రోజుల తర్వాతే రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆయా వ్యక్తులు తాము విదేశాలకు వెలుతున్నట్లుగా నిర్ధారించే ధ్రువపత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశాలకు వెళ్లే ఎంతో మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది.

కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు డోసుల మధ్య 6-8 వారాల వ్యవధి ఉండగా.. దాన్ని ఇప్పుడు 12వారాలకు పెంచింది. అయితే, డెల్టా వేరియంట్‌ వంటి కొత్త రకాలను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ రెండో డోసు కాల పరిమితిని 8వారాలకు తగ్గించాలని నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్‌ విధానంలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని