Covovax: 12-17 ఏళ్ల పిల్లల కోసం మరో టీకా.. డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌

12-17 ఏళ్ల పిల్లల కోసం దేశంలో మరో కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) తయారు చేసిన కొవొవాక్స్​ అత్యవసర వినియోగానికి......

Published : 09 Mar 2022 22:38 IST

దిల్లీ: దేశంలో పిల్లల కోసం మరో కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. 12-17 ఏళ్ల పిల్లల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) తయారు చేసిన కొవొవాక్స్​ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొన్ని షరతులతో అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో భారత్​లో 18 ఏళ్ల లోపు పిల్లలకు అందుబాటులోకి వచ్చిన నాలుగో వ్యాక్సిన్​గా కొవొవాక్స్​ నిలవనుంది.

కొవొవాక్స్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ గత వారంలో సిఫార్సు చేయగా.. డీసీజీఐ ఇందుకు పచ్చ జెండా ఊపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేసే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

కొవొవాక్స్‌కు డీసీజీఐ అనుమతిని ఎస్‌ఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా ధ్రువీకరించారు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల్లో కొవొవాక్స్‌  90% కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నట్లు తేలిందని ఈ ఆయన పేర్కొన్నారు. త్వరలోనే 12 ఏళ్ల కంటే చిన్నవారికి కూడా టీకా అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని