Delhi Air Quality: ‘మా పిల్లలు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగానే ఉంది..’

చలికాలం సమయంలో దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. ఈ ఏడాది కూడా అక్కడి ప్రజలు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. 

Updated : 03 Nov 2022 12:02 IST

దిల్లీ: తమ పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి కష్టపడుతున్నారని దిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వచ్చే పొగతో దేశ రాజధానిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఫలితంగా గురువారం ఉదయం వాయు నాణ్యత సూచీ 408గా నమోదైంది. ఈ సూచీలో 401 నుంచి 500 మధ్య ఉంటే దానిని తీవ్రస్థాయిగా పరిగణిస్తారు.

వాయు నాణ్యత దారుణంగా పడిపోవడంతో దిల్లీ వాసులు ఆ విషపూరితమైన గాలినే పీల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది వృద్ధులు, పాఠశాలలకు వెళ్లే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ గాలిని ఇలాగే పీలిస్తే..తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ దీనిపై ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. గాలి నాణ్యత మెరుగుపడేవరకు పాఠశాలలు మూసివేయాలని కోరింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలు మూసివేయడం వంటి తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా సమస్యను షరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ పిల్లలు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం 424కు పడిపోయిన గాలి నాణ్యతా సూచీ.. నిన్న మెరుగై 376కు చేరింది. తాజాగా మళ్లీ 408గా నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని