Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’

పార్లమెంటు నిష్క్రియంగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విమర్శించారు. దాదాపు అన్ని కేంద్ర సంస్థలు నిర్వీర్యమైన ప్రస్తుత తరుణంలో దేశంలో ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి...

Published : 08 Aug 2022 02:21 IST

దిల్లీ: పార్లమెంటు నిష్క్రియంగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విమర్శించారు. దాదాపు అన్ని కేంద్ర సంస్థలు నిర్వీర్యమైన ప్రస్తుత తరుణంలో దేశంలో ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోందన్నారు. గత వారం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి సమన్లు రాకుండా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను రక్షించడంలో రాజ్యసభ ఛైర్మన్ విఫలమయ్యారని ఆరోపించారు. రాజ్యసభకు అది విచారకరమైన రోజుగా అభివర్ణించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ మేరకు వ్యాఖ్యానించారు.

అయోధ్య రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా సందేశమిచ్చేందుకే ఆగస్టు 5న కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చిదంబరం తోసిపుచ్చారు. నిరసన తేదీని నిర్ణయించినప్పుడు ఆ విషయం తమ దృష్టిలో లేదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీలంతా దిల్లీలోనే అందుబాటులో ఉంటారన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ అగ్ర నాయకత్వాన్ని కాపాడేందుకే ఈ ఆందోళనలు చేపట్టారన్న ఆరోపణలనూ ఖండించారు. నాటి నిరసనలు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్‌లపై మాత్రమేనని గతంలోనే ప్రకటించినట్లు గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు పొందిన నేతలు తమను తాము రక్షించుకునే స్థితిలో ఉన్నారని తెలిపారు.

తరచూ వాయిదాలు, ప్రతిపక్షాల నిరసనలతో వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు సమావేశాలు ఆశించిన స్థాయిలో సాగకపోతుండటంపై చిదంబరం స్పందిస్తూ.. పార్లమెంటు నిష్క్రియంగా మారిందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అధికార పక్షానికి చర్చలపై ఆసక్తి లేకపోవడమే దీనికి ఏకైక కారణమన్నారు. ధరల పెరుగుదలపై మొదటి రోజే చర్చకు అనుమతిస్తే.. ఒక్కరోజులోనే ముగిసేదని, రెండు వారాలు వృథా అయ్యేది కాదన్నారు. మరోవైపు అధిక ధరలు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు వివరించాల్సి పోయి.. మాంద్యం, ఇతర అంశాలపై మాట్లాడారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని