NEET: నీట్‌కు మినహాయింపు ఇచ్చేవరకు పోరాటం ఆగదు: స్టాలిన్‌

నీట్‌ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌ (Stalin) పేర్కొన్నారు.

Published : 21 Aug 2023 01:33 IST

చెన్నై: నీట్‌ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Stalin) స్పష్టంచేశారు. అంతేకాకుండా నీట్‌ వ్యతిరేక బిల్లుకు తాను ఎప్పటికీ సంతకం చేయనని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇటీవల పేర్కొనడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని.. ఇటువంటి సమయంలో గవర్నర్‌ వ్యాఖ్యలు అనవసరమన్నారు. నీట్‌ రద్దును డిమాండ్‌ చేస్తూ డీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టగా.. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్‌ ఇదే అంశంపై మాట్లాడారు.

నీట్‌ రద్దును కోరుతూ తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధితోపాటు ఇతర మంత్రుల నేతృత్వంలో అధికార డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో చేపట్టిన ఈ నిరసనలు ఇక్కడితో ఆగవన్నారు. ఇప్పటివరకు 21మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. దీనికి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలోనూ ఉద్యమిస్తామన్నారు. మధురై మినహా (ఇక్కడ ఆగస్టు 23న ఆందోళన చేపట్టనున్నారు) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో.. నీట్‌ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో డీఎంకే యువజన, విద్యార్థి, వైద్యుల విభాగాలతోపాటు డీఎంకే కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.

నీట్‌ కారణంగా 21 మంది ఆత్మహత్య

మరోవైపు, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షపై అధికార డీఎంకే రాజకీయం చేస్తోందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు కే అన్నామలై విమర్శించారు. నీట్‌ పరీక్షకు సంబంధించి ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి ఆందోళనలు జరగడం లేదని.. కేవలం డీఎంకే మాత్రం విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని