Raghav Chadha: మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జ్‌షీట్‌లో రాఘవ్‌ చద్దా పేరు

దిల్లీ మద్యం కుంభకోణం కేసు ఆమ్‌ ఆద్మీ పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. తాజాగా ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆప్‌ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) పేరును కూడా ప్రస్తావించారు.

Published : 02 May 2023 13:55 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor policy case) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. అయితే ఛార్జ్‌షీట్‌లో ఆయనను నిందితునిగా పేర్కొనలేదని తెలుస్తోంది. మద్యం విధానంపై మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia) నిర్వహించిన సమావేశంలో రాఘవ్‌ చద్దా కూడా పాల్గొనడంతో ఈ ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరును ప్రస్తావించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశం గురించి మనీశ్‌ సిసోదియా మాజీ కార్యదర్శి సి.అరవింద్‌ దర్యాప్తు సంస్థలకు చెప్పినట్లు ఈడీ (ED) వర్గాల సమాచారం. నూతన మద్యం విధానంపై సిసోదియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాఘవ్‌ చద్దాతో పాటు పంజాబ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ వరుణ్‌ రోజామ్‌, విజయ్‌ నాయర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు అరవింద్‌ దర్యాప్తు సంస్థలకు తెలిపారట. ఈ క్రమంలోనే రాఘవ్‌ (Raghav Chadha) పేరును ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

కాగా.. ఇటీవల సీబీఐ (CBI) దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో సిసోదియాను నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఆయన కస్టడీని కోర్టు మే 8వ తేదీ వరకు పొడగించింది. బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును కూడా కోర్టు శుక్రవారం మరోసారి కొట్టేసింది. ఇక ఇదే అనుబంధ ఛార్జ్‌షీట్‌లో భారాసా ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కుంభకోణంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను కూడా సీబీఐ ఇటీవల విచారించింది. గత నెల 16వ తేదీని కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు విచారించిన దర్యాప్తు సంస్థ.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని