భారత్‌లో మరిన్ని దీర్ఘకాల కరవులు

భూతాపం కారణంగా భారతదేశంలో మరింత ఎక్కువగా, దీర్ఘకాలం పాటు కరవు తప్పదని తాజా పరిశోధన వెల్లడించింది. భారత్‌తో పాటు చైనా, ఇథియోపియా, ఘనా, బ్రెజిల్, ఈజిప్ట్‌ లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యూకేలోని

Published : 29 Sep 2022 07:03 IST

 భూతాపంతో తప్పని పరిణామం

 మరో అయిదు దేశాల్లోనూ ఇంతే

దిల్లీ: భూతాపం కారణంగా భారతదేశంలో మరింత ఎక్కువగా, దీర్ఘకాలం పాటు కరవు తప్పదని తాజా పరిశోధన వెల్లడించింది. భారత్‌తో పాటు చైనా, ఇథియోపియా, ఘనా, బ్రెజిల్, ఈజిప్ట్‌ లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ యాంగ్లియా (యూఈఏ) పరిశోధకులు తెలిపారు. క్లైమాటిక్‌ ఛేంజ్‌ అనే పత్రికలో ఈ వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ఈ దేశాల్లోని వ్యవసాయ భూమి దాదాపు సగానికి పైగా రాబోయే 30 ఏళ్ల కాలంలో ఏడాది పాటు తీవ్ర కరవు బారిన పడుతుందని యూఈఏలో బయోడైవర్సిటీ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జెఫ్‌ ప్రైస్‌ తెలిపారు. భారతదేశంలో 50 శాతం, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా దేశాల్లో 80 నుంచి 100 శాతం జనాభా తీవ్ర కరవు బారిన పడుతుందన్నారు. అదే సమయంలో, ప్యారిస్‌ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటి స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఎక్కువ ఉండేలా పరిమితం చేస్తే ఈ ఆరు దేశాల్లోనూ అందరికీ మంచి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. మిగిలిన 5 దేశాల కంటే ఈజిప్టులో భూతాపం కొద్దిగా పెరిగినా కరవు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. భారత్, చైనాలో ఎక్కువ భూమి మంచుతో కప్పి ఉందని, అయితే భూతాపం 3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ఇందులో చాలా భూమి దీర్ఘకాలంపాటు కరవు బారిన పడుతుందని హెచ్చరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని