ISRO: విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!

చంద్రుడిపై నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లతో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణకు ఇస్రో చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని తెలిపింది.

Published : 22 Sep 2023 19:41 IST

బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనల కోసం ఉద్దేశించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చందమామ ఉపరితలంపై పరిశోధనలు పూర్తి చేసిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander), ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Pragnan Rover)లు ఇప్పటికే నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. వాటిని తిరిగి క్రియాశీలంగా మార్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇస్రో శుక్రవారం ఓ ట్వీట్‌ చేసింది.

‘విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు మేల్కొన్నాయా? అనే విషయాన్ని తెలుసుకునేందుకుగానూ వాటితో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటి వరకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే, వాటితో సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి’ అని ఇస్రో పేర్కొంది.

జాబిల్లిపై మళ్లీ సూర్యోదయం.. ఉత్కంఠభరిత సవాలుకు ఇస్రో సన్నద్ధం

వాస్తవానికి చంద్రయాన్‌-3 ప్రయోగంలోని ల్యాండర్‌, రోవర్‌లు 14 రోజులే పని చేస్తాయి (జాబిల్లిపై ఒక పగలుకు సమానం). ఆ తర్వాత సూర్యాస్తమయం కావడంతో.. రోవర్‌ను ఈ నెల 2న, ల్యాండర్‌ను 4న శాస్త్రవేత్తలు నిద్రాణ స్థితిలోకి పంపారు. చందమామపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్‌ 120-200 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోవడం, అంతటి శీతల పరిస్థితుల్లో అవి పనిచేసే అవకాశాలు లేకపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ల్యాండర్‌, రోవర్‌ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటితో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించేందుకు ఇస్రో చర్యలు తీసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని