విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లకు మేలుకొలుపు!

జాబిల్లిపై పరిశోధనల కోసం ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని దిగ్విజయంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఉత్కంఠభరిత సవాలుకు సన్నద్ధమవుతోంది.

Published : 22 Sep 2023 07:29 IST

జాబిల్లిపై మళ్లీ సూర్యోదయం
చంద్రయాన్‌-3 ల్యాండర్‌, రోవర్‌లను క్రియాశీలం చేసేందుకు ఇస్రో సమాయత్తం

బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనల కోసం ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని దిగ్విజయంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఉత్కంఠభరిత సవాలుకు సన్నద్ధమవుతోంది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తిచేసి చందమామ ఒడిలో నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లను తిరిగి క్రియాశీలంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించనున్నారు. నిజానికి ల్యాండర్‌, రోవర్‌ల జీవితకాలం 14 రోజులే (జాబిల్లిపై ఒక పగలుకు సమానం). ఆ రెండింటితో పాటు వాటిలో పొందుపర్చిన పేలోడ్‌లు అత్యంత కీలక డేటాను ఇస్రోకు చేరవేశాయి. ఆ తర్వాత సూర్యాస్తమయం కావడంతో వాటిని (రోవర్‌ను ఈ నెల 2న, ల్యాండర్‌ను 4న) శాస్త్రవేత్తలు నిద్రాణ దశలోకి పంపారు. చందమామపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్‌ 120-200 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోవడం, అంతటి శీతల పరిస్థితుల్లో అవి పనిచేసే అవకాశాలు లేకపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ల్యాండర్‌, రోవర్‌ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటిని నిద్ర నుంచి లేపి, కమ్యూనికేషన్‌ను పునఃస్థాపించుకునేందుకు ఇస్రో సమాయత్తమైంది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లలోని బ్యాటరీలు సౌర ఫలకల ద్వారా శుక్రవారానికి పూర్తిగా ఛార్జ్‌ అయ్యే అవకాశముందని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేష్‌ దేశాయ్‌ తెలిపారు. అదృష్టం బాగుండి ల్యాండర్‌, రోవర్‌ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే మరింత కీలక డేటా మన చేతికి అందుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని